మతపరమైన మైనారిటీలకు అన్యాయం

Injustice to religious minorities– ఐదేండ్లలో భారీగా క్షీణించిన సాధారణ వేతన ఉద్యోగాలు
– 2018 నుంచి 2023 మధ్య అధికంగా పడిపోయిన వైనం
– హిందూ జనాభాల్లో ఇది తక్కువ
– పీఎల్‌ఎఫ్‌ఎస్‌ డేటా
న్యూఢిల్లీ : దేశంలోని మోడీ పాలనలో మైనారిటీలకు భద్రతా పరంగానే కాదు.. ఉద్యోగపరంగానూ రక్షణ కరువైంది. గత ఐదేండ్లలో మెజారిటీ హిందూ జనాభాతో పోలిస్తే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు వంటి మతపరమైన మైనారిటీ వర్గాల్లో సాధారణ వేతన ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి వాటా బాగా తగ్గింది. వార్షిక పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) సమాచారమే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. మతపరమైన మైనారిటీలలో, ముస్లిం కమ్యూనిటీకి చెందిన కార్మికులు 2018-19 నుంచి 2022-23 మధ్య అత్యధిక క్షీణతను చూడటం గమనార్హం.
పీఎల్‌ఎఫ్‌ఎస్‌ను నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ 2017, ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఇది వర్కర్‌ పాపులేషన్‌ రేషియో, లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేట్‌, నిరుద్యోగిత రేటు వంటి కీలక ఉపాధి, నిరుద్యోగ సూచికలను అంచనా వేస్తుంది. ఇది సామాజిక, మత సమూహాల మధ్య ఉద్యోగ స్థితిని మరింత అంచనా వేస్తుంది.
ఈ సర్వే సమాచారం ప్రకారం.. 2018-19లో ముస్లిం కమ్యూనిటీకి చెందిన 22.1 శాతం కార్మికులు వేతన ఉద్యోగులుగా పని చేయగా, 2022-23లో అది 15.3 శాతానికి పడిపోయింది. ఈ తగ్గుదల 6.8 శాతం. అదేవిధంగా, క్రిస్టియన్‌ కమ్యూనిటీకి చెందిన జనాభా 3.2 శాతం పాయింట్ల క్షీణతను చూసింది. 2022-23లో కేవలం 28 శాతం క్రైస్తవ కార్మికులు మాత్రమే సాధారణ ఉద్యోగాలను కలిగి ఉన్నారు.
ఇది 2018-19లో 31.2 శాతం నుంచి తగ్గింది. సిక్కు సమాజం జనాభా 2.5 శాతం పాయింట్ల క్షీణతను చూసింది. 2022-23లో 26 శాతం సిక్కు కార్మికులు మాత్రమే వేతన ఉపాధిని కలిగి ఉన్నారు. 2018-19లో ఇది 28.5 శాతం నుంచి పడిపోవటం గమనార్హం.
ఇక మెజారిటీ హిందూ సమాజానికి ఉపాధి నాణ్యతలో క్షీణత చాలా తక్కువగా ఉన్నది. ఇక్కడ, 2022-23లో 21.4 శాతం మంది కార్మికులు రెగ్యులర్‌ జీతాలతో కూడిన ఉద్యోగాలను కలిగి ఉన్నారు. ఇది 2018-19లో 23.7 శాతం నుంచి 2.3 శాతం పడిపోయింది. అన్ని మత సమూహాలలో స్వయం ఉపాధి పెరిగినప్పటికీ, సాధారణ కార్మికుల వాటా ముస్లిం సమాజంలో మాత్రమే పెరగటం గమనార్హం.
2018-19లో 25.7 శాతం నుంచి 2022-23లో దాదాపు 26.3 శాతం మంది ముస్లిం కార్మికులు సాధారణ కార్మికులుగా పనిచేశారు. ఇది హిందువులు, సిక్కులు, క్రైస్తవుల వంటి ఇతర మత సమూహాలకు భిన్నంగా ఉన్నది. ప్రధాన మత సమూహాలలో, ముస్లింల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్‌), కార్మికుల జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్‌) ఒకే సమయంలో క్షీణించిందనీ గతేడాది అక్టోబర్‌లో ఒక వార్త సంస్థ నివేదించింది. ఇది 2020-21లో 35.5 శాతం ఉండగా.. 2022-23లో 32.5 శాతానికి తగ్గింది.

Spread the love