విద్యార్థుల భవిష్యత్తుకు ‘నవోదయం’..!

– సీటు సాధిస్తే ఏడు సంవత్సరాల పాటు ఉచిత విద్యాబోధన
– విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ.. ఉత్తమ విద్యా బోధన
నవతెలంగాణ – పెద్దవూర
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉత్తమ విద్యా భోదన అందిస్తుంది నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు లోని జవహర్‌ నవోదయ విద్యాలయం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించేందుకు 1986లో దీనిని స్థాపించారు. 2024–2025 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి 4638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో నల్గొండ జిల్లాలో 12 సెంటర్లలో 2254 మంది, సూర్యాపేట జిల్లాలో 8 సెంటర్లలో 1564, యదాద్రి భువనగిరి జిల్లాలో 05 సెంటర్లలో 805 మంది, మొత్తం 4638 మంది, అందులో బాలురు 2672, బాలికలు 1950 మంది, ట్రాన్స్ జెండర్లు 01 పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి జ‌న‌వ‌రి 20వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నాగార్జున సాగర్ నియోజకవర్గం లో పెద్దవూర జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో240 మంది, అనుముల మండలం హాలియా మున్సిపాలిటీలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 221 మంది విద్యార్థులు జవహర్ నవోదయ పరీక్షలు నిర్వహించనున్నారు.  మొత్తం సీట్లు..80. నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో సీటు సాధిస్తే ఏడు సంవత్సరాల పాటు ఉచిత విద్య అందుతుంది. చలకుర్తి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బాలికలకు 30 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. మొత్తం 80 సీట్లలో 75 శాతం అంటే 60 సీట్లను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, 20 సీట్లు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయిస్తారు.
– అత్యుత్తమ విద్యా ప్రమాణాలు : నవోదయ విద్యాలయంలో సీబీఎస్‌ఈ తో కూడిన అత్యుత్తమ విద్యా బోధన అందిస్తారు. నిపుణులైన అధ్యాపకలు బోధిస్తారు. సువిశాల ప్రాంగణం, ఆహ్లాదకర వాతావరణం, అధునాత కంప్యూటర్‌ ల్యాబ్‌, పోషక విలువలతో కూడిన ఆహారం, మానసికోల్లాసానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, ఎన్‌సీసీ తదితర అంశాలు నవోదయ విద్యాలయ ప్రత్యేకతలు. సీబీఎస్‌ఈ పరీక్ష ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తూ నవోదయాలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.
– పరీక్ష విధానం ఇదీ..నవోదయ ప్రవేశ పరీక్ష 100 మార్కులకు 80 ప్రశ్నలు ఉంటాయి. సమయం రెండు గంటలు. దివ్యాంగులకు అదనంగా 40 నిమిషాలు సమయం ఇస్తారు. మేధాశక్తిని పరీక్షిచేందుకు 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితంలో ప్రతిభను తెలుసుకునేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు, భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు ఇస్తారు.
– అత్యుత్తమ ప్రమాణాలు : విద్యాలయంలో అత్యుత్తమ విద్యాప్రమాణాలు ఉన్నాయి. విద్యార్థుల సర్వోతోముఖాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. విద్యాలయంలో కేరీర్‌ గైడెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశాం. న్యూట్రీషియన్‌ ఆధ్వర్యంలో పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నాం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు..నాగభూషణం ప్రిన్సిపాల్‌, చలకుర్తి నవోదయ పాఠశాల.
Spread the love