ఇన్సాస్‌ బుల్లెట్లు గాయబ్‌

–  48 గంటల్లో రికవరీ
–  ఇద్దరి నిందితుల అరెస్టు
–  రైల్వే అదనపు డీజీ శివధర్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి గాయబ్‌ అయిన ఇన్సాస్‌ బుల్లెట్లను 48 గంటల్లోనే రైల్వే పోలీసులు రికవరీ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు రాష్ట్ర రైల్వే పోలీసు విభాగం అదనపు డీజీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 24న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని పదో ప్లాట్‌ఫామ్‌పై సీఆర్పీఎఫ్‌ 95వ బెటాలియన్‌కు చెందిన సిద్ధార్థ్‌సింగ్‌ తన ఆయుధాల లగేజ్‌ను ఉంచాడు. లగేజ్‌ను కొద్దిసేపటి తర్వాత సిద్ధార్థ్‌ సింగ్‌ చెక్‌చేసుకోగా అందులో నుంచి ఇన్సాస్‌ తుపాకీకి సంబంధించిన 63 బుల్లెట్లతో పాటు మూడు మ్యాగ్జిన్లు కనిపించకుండా పోయాయి. దీనిపై సిద్ధార్థ్‌సింగ్‌ సికింద్రాబాద్‌ రైల్వే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వీటిని వెతకడానికి సికింద్రాబాద్‌ రైల్వే పోలీసుతో పాటు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు సంబంధించిన టీమ్‌లను అధికారులు రంగంలోకి దించారు. పదో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి బుల్లెట్లు, మ్యాగ్జిన్లను తీసుకెళ్లటం కనిపించింది. దాని ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులకు గాంధీనగర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో ఆ బుల్లెట్లను ఎత్తుకుపోయిన వ్యక్తి పట్టుబడ్డాడు. అతని పేరు దానమూర్తిగా గుర్తించిన అధికారులు విచారించగా వాటిని తాను గాంధీనగర్‌ మెట్రో రైల్వే స్టేషన్‌ దగ్గరే పారేసినట్టు తెలిపారు. అక్కడ గాలించిన పోలీసులకు బుల్లెట్లు లభించకపోవటంతో అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒక వృద్ధుడు వాకింగ్‌ కోసం వచ్చి బుల్లెట్లతో పాటు మ్యాగ్జిన్లను తీసుకెళ్లినట్టు కనిపించింది. ఎర్రటి షర్ట్‌ వేసుకొని వచ్చిన ఆ వ్యక్తి కోసం పోలీసులు సమీపంలోని భోలక్‌పూర్‌ బస్తీలో విచారించగా.. అతను సత్యనారాయణ అనే వ్యక్తిగా తేలింది. బస్తీవాసులు ఇచ్చిన ఆచూకీని ఆధారంగా సత్యనారాయణను పోలీసులు పట్టుకొని ఆయన వద్ద నుంచి ఇన్సాస్‌ బుల్లెట్లతో పాటు మ్యాగ్జిన్లను రికవరీ చేశారు. వీరిద్దరినీ అరెస్టు చేసి కేసును సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ షేక్‌ సలీమా నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ దర్యాప్తు జరుపుతున్నట్టు రైల్వే విభాగం అదనపు డీజీ శివధర్‌రెడ్డి తెలిపారు.

Spread the love