పరిశుభ్రత పాటించాలి: మండల పశువైద్యాధికారి డా. బి. విజయ్
నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)
బీర్కూర్ మండల కేంద్రంలోని మాంసం విక్రయ దుకాణాలను మంగళవారం మండల పశువైద్య అధికారి డాక్టర్ బి. విజయ్ తనిఖీ చేశారు. ఆయనతో పాటు పశుగణ సహాయకుడు ఎం. వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుకాణాల్లో విక్రయానికి ఉంచిన మాంసాన్ని పరిశీలించి నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం డాక్టర్ విజయ్ మాట్లాడుతూ చనిపోయిన లేదా వ్యాధుల బారిన పడిన జంతువుల మాంసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దుకాణాల పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని సూచించారు.
అలాగే మాంసం విక్రయ దుకాణాల యజమానుల లైసెన్సులను పరిశీలించి, గడువు ముగిసిన లైసెన్సులను వెంటనే రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల ద్వారా ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన మాంసం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.



