జైల్లో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్..

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహాడ్‌ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు ఎట్టకేలకు అధికారులు ఇన్సులిన్‌ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్ పెరగడం వల్ల తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇచ్చినట్లు తీహాడ్‌ జైలు అధికారులు తెలిపారు. ఎయిమ్స్‌ వైద్యుల సలహా మేరకే ఇచ్చినట్లు వెల్లడించారు. కేజ్రీవాల్ షుగ‌ర్ లెవ‌ల్స్ 217గా ఉన్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ వెల్లడించింది. కేజ్రీవాల్‌ను చంపాల‌న్న కుట్రలో బీజేపీ ఉన్నట్లు ఇటీవల ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ ఆరోపించారు. కావాల‌నే జైలు అధికారులు కేజ్రీవాల్‌కు చికిత్సను ఇవ్వడం లేద‌ని మండిపడ్డారు. అందుకే ఇన్సులిన్‌ కూడా నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్‌కు జైలు అధికారుుల ఇన్సులిన్‌ ఇచ్చారు. దీనిపై దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్ స్పందించారు. ‘‘ముఖ్యమంత్రి చెప్పిన మాట నిజమేనని, ఆయనకు ఇన్సులిన్ అవసరమని నేడు స్పష్టమైంది. కానీ, భాజపా ప్రభుత్వం కింద పనిచేస్తున్న కొందరు అధికారులు ఆయనకు ఉద్దేశపూర్వకంగా వైద్యసేవల్ని దూరం చేస్తున్నారు. ఇన్సులిన్ అవసరం లేకపోతే మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు..? ప్రపంచం మొత్తం వారిని శపిస్తుండటమే అందుకు కారణం’’ అని అన్నారు.

Spread the love