ఏజెన్సీ అభ్యర్థుల్లో అంతర్మధనం..!!

Inside money among agency candidates..!!– ప్రజలకు ఏం చెప్పి ఓట్లడుగాలో తెలియని పరిస్థితి..
– ఏజెన్సీ అభివృద్ధి శూన్యం
– నిధులివ్వకపోతే నేనేమీ చేసేది
– అవకాశం ఇస్తే నిధులు పట్టకొస్తానంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
– ఆనాటి సీపీఐ(ఎం) ఎమ్మెల్యేల పోరాటాలు గుర్తు చేసుకుంటున్న స్థానికులు
– ఈసారి అంతు చిక్కని ఏజెన్సీ ఓటరు నాడి
నవతెలంగాణ-భద్రాచలం
అసెంబ్లీ ఎన్నికల వేడి రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తుండగా భద్రాచలంలో మరింత హీట్‌ ఎక్కింది. ఈసారి ఇక్కడే ఓటర్‌ నాడి అంతుచిక్కని విధంగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా డా.తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్‌ పార్టీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బీజేపీ నుంచి కుంజా ధర్మా బరిలో నిలుస్తున్నట్టు ఆయా పార్టీలు ప్రకటించాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా, బీజేపీ అభ్యర్థి కుంజా ధర్మ నియోజకవర్గంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోదెం వీరయ్య దాదాపు పదివేలకు పైగా మెజార్టీతో డాక్టర్‌ తెల్లంపై గెలుపొందారు. అయితే ఐదేండ్లుగా భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు తెచ్చేందుకు ఈ ఎమ్మెల్యే ప్రయత్నం గానీ, అధికార పార్టీ నుంచి ఆశించినంత సహాయం గానీ తగినంత లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. దాంతో ఈ ఎమ్మెల్యేని ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా, సీఎం ప్రకటించిన హామీలను ఎందుకు నెరవేర్చ లేకపోయారని ప్రతిపక్ష పార్టీలు ప్రధాన అస్త్రంగా సంధిస్తున్నాయి. అలాగే, ఈ పదేండ్ల్లు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉంది కదా.. భద్రాచలంకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని స్థానిక ప్రజలూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం ఓటర్లు ఈ సారి ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టనున్నారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.
తెల్లం వెంకట్రావు ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లటం, నాటకీయ పరిణామంలో మళ్లీ ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లోకి రావటం, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టికెట్‌ను దక్కించుకోవటం చక చకా జరిగిపోయింది. తనకు ఒక్క అవకాశం ఇస్తే భద్రాచలం ఏజెన్సీ అభివృద్ధి చేస్తానంటూ డాక్టర్‌ తెల్లం తన ఎన్నికల ప్రచారంలో నొక్కి వక్కాణిస్తున్నారు. భద్రాచలం పుణ్యక్షేత్ర ప్రగతిపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో రామ భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపు విభజన పేరుతో ఇప్పటికే భద్రాచలం రూపురేఖలు కోల్పోయిందని, జిల్లాల పునర్విభజనతో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన చెందుతున్న ప్రజలు.. ఆనాటి సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థుల పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, భద్రాచలం నియోజకవర్గంలో గతంలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి, సున్నం రాజయ్య, ఎంపీ డాక్టర్‌ మీడియం బాబురావు.. ప్రభుత్వాల నుంచి కోట్టాడి కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చర్చించుకుంటున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు ఉండి, సమస్య పరిష్కారానికి ఎంతగానో పాటుపడ్డారని ఎన్నికలవేళ ప్రజలు బహిరంగంగానే స్మరించుకుంటున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని, ప్రజల గోడు పట్టించుకునే నాధుడే కరువయ్యాడని, ఎన్నికలవేళ హడావుడి తప్ప, సాధారణ రోజుల్లో ఏజెన్సీ వాసులను ఏ నాయకుడూ పలకరించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపుపై దీమా ప్రకటిస్తున్నప్పటికీ, అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. ఎవరు గెలిచినా తమ పరిస్థితి ఇంతేనని స్థానిక ఓటర్లు కలత చెందుతున్నారు

Spread the love