పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం

– యాసంగి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
– వర్షాకాలం సీజన్లో కొత్త మార్గదర్శకాలు వచ్చే అవకాశం
నవతెలంగాణ- మల్హర్ రావు
యాసంగి సీజన్ పంటల సాగుకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత పద్దతినే అనుసరించింది.గత వర్షాకాలం సీజన్ లో రైతుబందు సాయం రైతుల ఖాతాల్లో జమ చేసిన విధానంలోనే ఈ సీజన్ లో అందించడానికి కార్యాచరణ చేపట్టింది. తాము అధికారంలోకి వస్తే రైతుబందు పథకం పేరును రైతు భరోసా గా మార్చి ఎకరాకు ఒక్కొక సీజన్ కు రూ.7.500 అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో లో పేర్కొంది. రైతు భరోసాకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించి అమలు చేసే వరకు ఎక్కువ సమయం పడుతోందని తెల్సిన ప్రభుత్వం ఈ సీజన్లో పాత విధానాన్ని అనుసరించడానికి మొగ్గు చూపింది. సాధారణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రైతుబందు సాయాన్ని విడుదల చేయడానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుంది. కానీ అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు ఒ ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ పెట్టుబడి సాయాన్ని నిలిపివేసింది.గత ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ట్రైజరిలో జమ చేసి ఉంచింది.ఇప్పటికే యాసంగి సీజన్ పనులు మొదలు కావడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం బ్యాంకులు, ఫైనాన్స్, ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించడం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పాత విధానంలోనే జమ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలత స్పష్టం చేయడంతో తొలిరోజు ఎకరం భూమి ఉన్నవారికి రైతుబందు సాయం జమ చేశారు. ఇలా ఒక్కొక్క రోజు భూమి విస్తీర్ణాన్ని పెంచుతూ జమ చేయనున్నారు.
Spread the love