ఐరీస్‌ తిప్పలు..!

Iris flips..!– మార్కెట్‌కు వచ్చి విక్రయించాలనే షరతుతో రైతులకు ఇబ్బందులు
– కౌలు రైతు ఒప్పంద వివరాలు చూపడం కష్టం
– గత విధానం వల్ల కొన్ని చోట్ల బినామీల పేరిట అక్రమాలు
– దళారుల్ని అరికట్టేందుకే..: డీసీఎస్‌ఓ
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోలు విధానంలో కొత్తగా తీసుకొచ్చిన ఐరీస్‌ పద్ధతి రైతులకు తలనొప్పిగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ, పీఎసీఎస్‌ కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఈ యాసంగి సీజన్‌ నుంచి కొత్తగా ఐరీస్‌ విధానం తీసుకొచ్చారు. ఐరీస్‌ పద్ధతి వల్ల పండించిన రైతులే మార్కెట్‌కు వచ్చి ధాన్యాన్ని విక్రయించాలి. అప్పుడే అతని ఐరీస్‌ నమోదు చేస్తారు. ఇంతకుముందు కుటుంబంలో ఎవరో ఒకరు ధాన్యం తూకం వేసే సమయంలో ఉండి ఆధార్‌ నెంబర్‌, ఓటీపీ చెబితే సరిపోయేది. కొత్త విధానం వల్ల రైతే మార్కెట్‌కు వెళ్లి ఐరీస్‌ ఇవ్వాలి. టోకెన్‌ పద్ధతిలో ధాన్యం ఎప్పుడు కాంటా వేస్తారో తెల్వని పరిస్థితుల్లో రైతు కళ్లాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తది. కౌలు రైతు యజమాని నుంచి ఒప్పంద వివరాలివ్వాలి. లేదంటే ధాన్యం అమ్ముకోలేరు.
రాష్ట్రంలో యాసంగి వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ ఇతర జిల్లాల్లో ధాన్యం మార్కెట్‌కు వస్తోంది. ఈ సీజన్‌లో నీటి ఎద్దడి వల్ల ధాన్యం దిగుబడులు తగ్గే అవకాశముంది. రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ద్వారా గతేడాది యాసంగిలో 66.85 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ సీజన్‌లో 60.70 లక్షల టన్నుల ధాన్యమే సేకరించే అవకాశముంది. ఐకేపీ, పీఎసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏడు వేల కొనుగోలు కేంద్రాలు పెట్టనున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో యాసంగి సీజన్‌లో 7.46 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 800 కేంద్రాలు పెట్టి 6.88 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయనున్నారు.
కొత్తగా ఐరీస్‌ విధానం
ధాన్యం కొనుగోలు విధానంలో పౌర సరఫరాల శాఖ కొత్తగా ఐరీస్‌ విధానాన్ని అమలు చేస్తుంది. గతంలో రైతు ధాన్యాన్ని విక్రయించేందుకు ఆధార్‌ నంబర్‌ ఇచ్చేవారు. ఆ నెంబర్‌ను బ్యాంక్‌ ఖాతాకు అనుసంధానం చేయగానే రైతు సెల్‌పోన్‌కు ఓటీపీ వచ్చేది. దానిని ట్యాబ్‌లో నమోదు చేసి ఓటీపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేసేది. ఈ విధానం వల్ల కొందరు దళారులు సైతం రైతుల పేరిట ధాన్యం విక్రయాలు చేసిన పరిస్థితి ఉంది. మిల్లర్లు, వ్యాపారులు దళారుల ద్వారా బినామీ రైతుల పేరిట ధాన్యం అమ్మకాలు జరిపి అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు రాష్ట్రంలో అనేక చోట్ల వెలుగు చూశాయి. అందుకే ఈ సీజన్‌ నుంచి కొత్తగా ఐరీస్‌ పద్ధతిని తీసుకొచ్చారు. ధాన్యం పండించిన రైతు మార్కెట్‌కు ఖచ్చితంగా రావాలి. ధాన్యాన్ని కాంటా వేసిన తర్వాత సెంటర్‌ నిర్వాహకులు రైతు ఐరీస్‌ను తీసుకుంటారు. ఆధార్‌ నంబర్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం ద్వారా వచ్చే ఓటీపీతోపాటు అదనంగా ఐరీస్‌ను కూడా ట్యాబ్‌లో నమోదు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. అన్ని సెంటర్లకు కూడా ఐరీస్‌ పరికరాల్ని అందజేశారు. ఐరీస్‌ విధానం గురించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.
కౌలు రైతులు ఒప్పంద పత్రాలు చూపేదెట్ట..
ఐరీస్‌ నమోదు విధానం కౌలు రైతులకు కొత్త తిప్పలు తెచ్చింది. రాష్ట్రంలో 40 శాతానికి పైగా పంట భూముల్ని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. కౌలుదారి రక్షిత చట్టం అమల్లో ఉన్నందున భూమి యజమానులెవ్వరూ కౌలుదారులకు ఒప్పంద పత్రాలు రాసి ఇవ్వడం లేదు. పరస్పర అంగీకారంతోనే కౌలు విధానం కొనసాగుతుంది. తాజాగా ప్రభుత్వం తెచ్చిన ఐరీస్‌ విధానంలో కౌలు రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ముందుగా పట్టాదారుతో రాసుకున్న కౌలు ఒప్పంద పత్రాల వివరాల్ని మండల వ్యవసాయ విస్తరణాధికారికి ఇవ్వాలి. ఎవరి భూమిని కౌలుకు తీసుకున్నారో వివరాలను నమోదు చేయించాలి. ఆ వివరాలను ఎఈఓ ఓపీఎంఎస్‌ (ఆన్‌లైన్‌ పొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)లో నమోదు చేస్తారు. తద్వారా కౌలు రైతు పండించిన ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశముంటది. అయితే రాష్ట్రంలో కౌలు విధానానికి చట్టబద్దత లేదు. వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలను బట్టి కౌలు సాగు కొనసాగుతోంది. సీజన్‌ ప్రారంభానికి ముందే చెబితే ఒప్పందం చేసుకునే వీలుంటుంది. యాసంగి సీజన్‌ ముగింపులో ఒప్పంద వివరాలు ఇవ్వడం ఎలా సాధ్యమని కౌలుదారులు ప్రశ్నిస్తున్నారు.
కళ్లాల్లోనే రైతు పడిగాపులు
ఐకేపీ, పీఎసీఎస్‌ కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకెెళ్లాలి. తేమ లేకుండా ఆరబోసుకుని శుభ్రం చేయాలి. గ్రేడ్‌-ఏ, సాధారణ రకాలకు వేర్వేరు ధర ఇస్తారు. ధాన్యం శుభ్రం చేశాక సెంటర్‌ నిర్వాహకులు రైతుకు టోకెన్‌ నెంబర్‌ ఇస్తారు. సీరియల్‌ ప్రకారం కాంటా వేస్తారు. వారాల తరబడి ధాన్యం కాంటాకు నోచుకోక రైతులు మార్కెట్‌లో ఉండాల్సి వస్తోంది. ధాన్యం కాంటా వేసే సమయంలో రైతు తప్పకుండా సెంటర్‌కు రావాలనే షరతు పెట్టడంతో కళ్లాల వద్దనే పడిగాపులు కాయాల్సి వస్తదని రైేతులు ఆవేదన చెందుతున్నారు.
వ్యాపారుల వైపు రైతుల మొగ్గు
రైస్‌ మిల్లర్లు, వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. నీటి ఎద్దడి వల్ల వరి పైర్లు ఎండిపోయాయి. దీంతో ధాన్యం దిగుబడుల్లో తాలు, ఇతర వేస్టేజి అధికంగా ఉంటుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలంటే తేమ, తాలు, చెత్త లేకుండా ఉండాలి. అయినా బస్తాకు 3- 5 కిలోల వరకు తరగు తీస్తారు. హమాలీ చార్జీలు చెల్లించాలి. వీటికి తోడు ఐరీస్‌ తిప్పలు రావడంతో కొందరు రైతులు కోత కోయగానే నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. వారం పది రోజుల ఒప్పందంతో డబ్బులు తీసుకుంటున్నారు.
దళారుల్ని అరికట్టేందుకే ఐరీస్‌
ధాన్యం కొనుగోళ్ల విషయంలో దళారులు అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకే ఐరీస్‌ విధానం. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం తెచ్చి ఇక్కడి కేంద్రాల్లో విక్రయించడానికి వీలుండదు. మిల్లర్లు, వ్యాపారులు బినామీ రైతుల పేరిట ధాన్యం తెచ్చి మద్దతు పొందడం కూడా ఉండదు.
కె.వనజాత, జిల్లా పౌర సరఫరాల అధికారి, సంగారెడ్డి

Spread the love