ఎమ్మెల్యేలకు వినతిస్తున్న కాంగ్రెస్ నేతలు
అచ్చంపేట ఎమ్మెల్యే ఆసక్తి చూపడం లేదని ఆరోపణ.?
నవతెలంగాణ-అచ్చంపేట
సర్వసాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన నాయకుల పేరును ఆయా జిల్లాలలో (డీసీసీ) జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పెట్టడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని మారుమూల గ్రామం లక్షింపల్లికి చెందిన మల్లు అనంత రాములు 1989లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రిగా , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షులుగా, జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాగర్ కర్నూల్ (ఎస్సీ రిజర్వుడు) నుంచి పార్లమెంటు సభ్యునిగా పని చేశారు. జాతీయంగా, ఢిల్లీలో కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకునిగా సుదీర్ఘంగా పదవి బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిదంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రస్తుతం నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మల్లు అనంత రాములుకు స్వయానా సోదరులు. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నాలుగు నియోజకవర్గాలున్నాయి.
ఈ ప్రాంతంలో మల్లు అనంత రాములు సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు దళిత పేద ప్రజల కోసం పనిచేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు, అచ్చంపేట అసెంబ్లీ సభ్యులను ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వుడు చేయడం జరిగింది. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయానికి మల్లు అనంతరాలు పేరు పెట్టాలని కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేసినట్టు తెలిసింది.
ఈ విషయమై పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిసముల్ల ఆనంద్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు వినతిపత్రం ఇచ్చారు. కానీ ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించ లేదని ఆరోపణలు బహిర్గతంగా వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో మాల సామాజిక వర్గంలో అచ్చంపేట, నాగర్కర్నూల్ నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పడు కూడా కాంగ్రెస్ పార్టీకి, అభివృద్ధి కోసం కృషి చేసిన దళిత జాతి అభివృద్ధికి పనిచేసిన నాయకుల పేర్లు ప్రస్తావించకపోవడం పట్ల దళిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
మల్లు అనంత రాములు పేరు పెట్టాలని పార్లమెంటు సభ్యులు మల్లు రవి, అభిమానులు, కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిర్గతంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు.



