యూసీసీ అమలు సాధ్యమేనా?

– ముసాయిదా రూపకల్పనే జరగలేదు
– వివిధ సమూహాల నుంచి వ్యతిరేకత
– అమల్లో సంక్లిష్టతలు
న్యూఢిల్లీ : రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ తన పార్టీకి ఓ ఎన్నికల అస్త్రాన్ని అందించారు. అదే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ). మన దేశంలో ప్రస్తుతం వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వం వంటి విషయాలకు సంబంధించి వివిధ మతాల వారికి వేర్వేరు చట్టాలు అమలులో ఉన్నాయి. అంతేకాక కులం, తెగ, భాష ఆధారంగా వివిధ ప్రాంతాలలో వేర్వేరు సాంస్కృతిక కట్టుబాట్లు కొనసాగు తున్నాయి. అయితే ఈ చట్టాలు, కట్టుబాట్ల స్థానంలో దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టాన్ని తీసుకురావాలని ప్రధాని ప్రతిపాదిస్తున్నారు. అదే యూసీసీ. అయితే దీని అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ముస్లింలలో బహుభార్యత్వం, జననాల రేటుపై బీజేపీ తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తోంది. అయితే వాస్తవానికి బహుభార్యత్వం అనేది ముస్లింలతో పోలిస్తే హిందువులలోనే ఏదో ఒక రూపంలో అధికంగా ఉంటోంది. ఈ విషయాన్ని హిందూ శక్తులు గుర్తించడం లేదు. దేశంలో మైనారిటీల సంఖ్య పెరిగిపోతోందని, ఇది కొనసాగితే కొంతకాలం తర్వాత దేశం ముస్లిం దేశం అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి బహుభార్యత్వానికి, జననాల రేటుకు పెద్దగా సంబంధం లేదు. ముస్లింలలో జననాల రేటు తగ్గుతోంది. పర్సనల్‌ లాను జనాభా పెరుగుదలతో ముడిపెట్టడంలో భాగంగానే ఉత్తరాఖండ్‌ యూసీసీ బృందం ‘ఇద్దరు పిల్లలు’ అనే చైనా విధానాన్ని పరిశీలిస్తోందని తెలిసింది.
ఆదేశిక సూత్రమే
సుమారు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న మోడీ యూసీసీని ఎందుకు అమలు చేయలేదనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి యూసీసీ అంటే ఎవరికీ తెలియదు. ఏడు దశాబ్దాలుగా దీనిపై చర్చ జరుగుతున్నప్పటికీ పరిశీలన, చర్చ కోసం ఇప్పటివరకూ నిర్దిష్ట ప్రతిపాదన ఏదీ రాలేదు. యూసీసీ ప్రస్తావన రాజ్యాంగంలో ఉన్నప్పటికీ పెద్దగా వివరాలు లేవు. పైగా రాజ్యాంగ నిర్మాతలు దానిని ఆదేశిక సూత్రాలలో మాత్రమే చేర్చారు. అంటే దీనిని నిర్బంధంగా అమలు చేయలేరు.
ఈశాన్యంలో నిరసన
యూసీసీపై ఇప్పటి వరకూ కనీసం ముసాయిదాను కూడా రూపొందించలేదు. దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని అమలు చేయడం ఎంత సంక్లిష్టతతో కూడుకున్నదో తెలియంది కాదు. ముస్లింలను యూసీసీ పరిధిలోకి తేవాలని హిందూత్వ వాదులు వాదిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ముస్లిం పర్సనల్‌ లా వలసవాదుల సృష్టి. వివిధ దేశాలలో నివసిస్తున్న ముస్లింలకు వేర్వేరు చట్టాలు అమలులో ఉన్నాయి. మన దేశంలో కూడా ప్రాంతాలు, జాతులను బట్టి వేర్వేరు చట్టాలను అమలు చేస్తున్నారు. ఉదాహరణకు భారత రాజ్యాంగం పార్లమెంటరీ చట్టాల నుండి ఈశాన్య ప్రాంతాలను వేరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌లో నాగాలు, మిజోల ఆచారాలకు సంబంధించిన చట్టాల ప్రస్తావన ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఈశాన్య ప్రాంతాల నుండి యూసీసీపై నిరసన గళాలు విన్పిస్తున్నాయి. యూసీసీ వ్యతిరేకులలో బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఉండడం గమనార్హం. యూసీసీని అమలు చేస్తే రాష్ట్రానికి చెందిన 60 మంది ఎమ్మెల్యేల నివాసాలను తగలబెడతామని ఓ నాగా గ్రూపు హెచ్చరించింది కూడా.
ఇతర రాష్ట్రాలలో సైతం…
ఈశాన్యంలోనే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలలో సైతం యూసీసీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యూసీసీని అమలు చేస్తే తమకు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగపరమైన రక్ష ణలు లేకుండా పోతాయని జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. సిక్కు వివా హ చట్టం ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని అకాలీదళ్‌ అం టోంది. ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ తరహాలోనే ఆదివారం నాడు సిక్కు పర్సనల్‌ లా బోర్డ్‌ను ఏర్పాటు చేశారు.
మాంసంపై నిషేధం నుంచి యూసీసీ వరకూ…
బీజేపీ హిందూత్వ పార్టీ అనే విషయంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. బీజేపీ ప్రభుత్వ చేతలు ఈ విషయాన్ని నిజం చేస్తున్నాయి. ఆవు మాంసంపై నిషేధం విధించడం, హిందూ మత ఆచారాలను పాటించాలంటూ హిందూయేతరులను బలవంతం చేయడం, మత మార్పి డుల నిరోధక చట్టాన్ని తీసుకురావడం, పౌరసత్వ సవరణ చట్టం నుండి ముస్లింలను వేరు చేయడం వంటి చర్యలన్నీ బీజేపీ హిందూత్వ పోకడలకు అద్దం పడుతున్నాయి. ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకున్న దంపతులను మతోన్మాదులు బెదిరిస్తున్న ఉదంతాలు అనేకం. మతాంతర వివాహాలను ఈ శక్తులు వ్యతిరేకిస్తాయి. ఇలాంటి పరిస్థితు ల్లో ముస్లింలు, సిక్కులు, నాగాలు వంటి మైనారిటీలు యూసీసీని వ్యతిరేకించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఓట్లు రాలవు
రాబోయే లోక్‌సభ ఎన్నికలలో రాజకీయ ప్రయోజనం పొందేందుకే మోడీ ప్రభుత్వం యూసీసీని తెరపైకి తెస్తోంది. అయితే దీనివల్ల బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండక పోవచ్చు. ఎందుకంటే బీజేపీ మద్దతుదారులందరూ యూసీసీని కోరుకుంటున్న వారే. నూతన చట్టాన్ని ప్రతి పాదించడం వల్ల బీజేపీకి అదనంగా వచ్చే ఓట్లేమీ ఉండవు. పైగా మైనారిటీ ఓట్లను ఆకర్షించేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉంది.

Spread the love