ఎద్దు ఈనింది దూడను గుంజకు కట్టేయమన్నాడట

ఎద్దు ఈనింది దూడను గుంజకు కట్టేయమన్నాడటకొందరు ఏది చెప్పినా ఎదురు చెప్పడం ఉండది. ఎద్దు ఈనింది అన్నా గాడిద గుడ్డు పెట్టిందన్నా ‘సరే’ అనాల్సిందే. పెద్దరికం తలకాయల నిండి అహంకారం పెరుగుతుంది. ఇది కాదు అంటే వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత వాళ్లే బోర్ల పడతరు. ‘ఎద్దు ఈనింది దూడను గుంజకు కట్టేయమన్నడట’ అనే సామెత అట్లనే పుట్టింది. ఈనుడు అంటే ప్రసవించుడు. ఎద్దు మగ జాతి కదా ఎట్లా ప్రసవిస్తది అనే ఇంగితం ఉండదు. ఆయన దగ్గర పనిచేసే వారు ఎదురు చెప్పరు. చెబితే ఉద్యోగాలు పోతయి. సరే దొర కట్టేస్తా అనాల్సిందే. ఏది ఏమైనా ‘ఎద్దు పుండు కాకికి ముద్దు’. పనిచేసే వారి బాధలు యజమానులకు తెలువవు. వాళ్లు పని చెప్తూనే ఉంటారు. ఎద్దుకు పుండు అయి అవస్థ పడుతున్నా దాని పైన కూర్చొని కాకి పుండును తొలుస్తూనే ఉంటుంది. ‘ఎద్దుగా ఏడాది బతికే కంటే అంబోతుగా ఆరు నెలలు బ్రతికితే చాలు’ అనే సామెత కూడా ఉన్నది. ఆంబోతు అంటే నవయువ్వనములో ఉన్న కోడెదూడ. ఎద్దు అంటే వయసు మల్లినది. బాగా ముసలిదైన ఎద్దును ఓ మూలకు కట్టేస్తారు. ఆంబోతు అయితే చేను చెలకల మీద పడి ఇష్టానుసారం తిరుగుతది.
అలాగే ‘ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి’ అనే సామెతను తిండి మీద మనసుతో రుచికరంగా తినని వాళ్ల గురించి వాడుతారు. కొందరు నేను అది తిన ఇది తిన అని పొంకనాలు పోతారు. వాళ్ళని దష్టిలో పెట్టుకొని ఈ సామెత ఉపయోగిస్తారు. ఎద్దును ఎప్పుడైనా మొద్దు కిందనే లెక్క చేస్తారు. ఆవును గౌరవిస్తరు. ఎద్దు నాగలి దున్నుతది. ఆవు పాలు ఇస్తది. దీనంత ఆక్టివ్‌ నెస్‌ దానిలో కనిపించదు. అందుకే ‘ఎద్దోలె తిని మొద్దోలె నిద్ర పోతాడు’ అని ఏమి పని చేయక తినుడు, తిరుగుడు, పండుడు మాత్రమే కార్యక్రమాలు ఉన్నవాళ్లను అంటారు. జన సామాన్యం నుంచి పుట్టిన సామెతల్లో యతిప్రాసలు ఉంటాయి. జానపదులు స్వయంగా కవులు. అందుకే ఎద్దు.. మొద్దు.. ఎద్దుగా ఏడాది.. ఆంబోతుగా ఆరు నెల్లు అనే పదాల సజన జరుగుతుంది.

Spread the love