– సమస్యల పరిష్కారానికి ఐక్యత
నవతెలంగాణ-కాటారం
ప్రజల సమస్యలను సమగ్రంగా గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో కాటారం మండల కేంద్రంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు అజ్మీరా పూల్ సింగ్ నాయక్, పీక కిరణ్, రామగిరి రాజు, సడవలి రావు మాట్లాడారు.
వారు వెల్లడించిన వివరాల ప్రకారం, మే 7, గురువారం రోజున కాటారంలో అధికారికంగా కుల సంఘాల జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి ఈ వేదిక కీలకంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో ప్రజలపై దాడులు, కుల వివక్ష ఘటనలు, పోలీసుల అక్రమ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కాంట్రాక్టర్లు భవనాలు, రోడ్ల నిర్మాణాల్లో ఆలస్యం చేయడం వల్ల అభివృద్ధి పనులు నెమ్మదిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలోని అన్ని కుల సంఘాలు ఐక్యంగా ముందుకు వచ్చి జేఏసీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ జేఏసీ ఒక శక్తివంతమైన వేదికగా మారుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.



