– ఎన్నిక లాంఛనమే…
– 30 వరకు సిటీ సివిల్ కోర్టు స్టే
– రాజేందర్ వీఆర్‌ఎస్‌కు ప్రభుత్వ ఆమోదం
– రేపు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర నాన్ గెజిటెడ్ (టీఎన్జీవో) కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రజార్యోగం, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం ఆయన ఉద్యోగం నుంచి రిలీవ్ అవుతారు. టీఎన్జీవో అధ్యక్ష బాధ్యతల నుంచి రాజేందర్ గురువారమే తప్పుకున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో శనివారం చేరనున్నారు. అయితే టీఎన్జీవో కొత్త అధ్యక్షుని ఎంపిక కోసం గురువారం కార్యవర్గ సమావేశాన్ని సైతం నిర్వహించారు. టీఎన్జీవో అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎన్నిక చేపట్టకూడదంటూ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈనెల 30 వరకు టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్నిక చేపట్టొద్దంటూ సంబంధిత కోర్టు స్టే విధించింది. దీంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే టీఎన్జీవో కేంద్ర సంఘం ఆనవాయితీ ప్రకారం ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న మారం జగదీశ్వర్ అధ్యక్షులుగా ఎన్నికవుతారని తెలుస్తున్నది. అంతకుముందు కార్యవర్గంలోనూ మారం జగదీశ్వర్ పేరును ఖరారు చేసేందుకు అంతా సిద్ధం చేసినట్టు సమాచారం. కోర్టు స్టే విధించడంతో అధికారికంగా ప్రకటించలేదు. ఆయన ఎన్నిక లాంఛనమేనని తెలుస్తున్నది. ఈనెల 30న మరోసారి టీఎన్జీవో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి అందులో నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లను ఎన్నుకునే అవకాశమున్నదని ఆ సంఘం సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాతే అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఉన్న జగదీశ్వర్ అధ్యక్ష బాధ్యతలను చేపడతారని సమాచారం.
ప్రధాన కార్యదర్శిగా కె లక్ష్మణ్?
టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి పదవిని ఆశించే వారు భారీగానే పోటీ పడుతున్నట్టు తెలుస్తున్నది. ఈనెల 30న టీఎన్జీవో అధ్యక్షులుగా మారం జగదీశ్వర్ ఎన్నిక లాంఛనమే కానుంది. అయితే ప్రధాన కార్యదర్శి పదవి ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పదవి కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో కె లక్ష్మణ్, రామినేని శ్రీనివాసరావు, ముజీబ్, ముత్యాల సత్యనారాయణగౌడ్, కస్తూరి వెంకటే శ్వర్లు తదితరులు ఉన్నారు. అయితే సీనియార్టీ ఆధారంగా ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వాలని కొందరు సీనియర్లు కార్యవర్గం దృష్టికి తెచ్చే అవకాశమున్నది. ప్రస్తుత రంగా రడ్డి జిల్లా అధ్యక్షులు కె లక్ష్మణ్ అందరికంటే సీనియర్‌గా ఉన్నారు. కాబట్టి ఆయనకు ప్రధాన కార్యదర్శి ఇవ్వాలం టూ కొందరు సీనియర్లు, కార్యవర్గ సభ్యులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. అయితే పోటీ చేసే వారు అందరూ అంగీకరిస్తే లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశాలున్నాయి.
కాదంటే ఓటింగ్ జరిగే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నికపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది.