– జంగయ్య నియామకంతో ఎంఆర్పీఎస్‌కు కొత్త ఊపు
నవతెలంగాణ – ఉప్పునుంతల
అచ్చంపేటలోని బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో నిర్వహించిన ఎంఆర్పీఎస్ సమావేశంలో భాగంగా ఉప్పునుంతల మండల ఎంఆర్పీఎస్ ఇన్‌చార్జిగా భీంపాకుల జంగయ్యను నియమించారు. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదిగ జాతి విద్యాభివృద్ధి, డ్రాప్‌అవుట్ విద్యార్థులను తిరిగి చదువులోకి తీసుకురావడం లక్ష్యంగా 40 రోజుల పాటు “గో టు విలేజ్” కార్యక్రమాన్ని నిర్వహించాలని జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశించినట్లు నాయకులు తెలిపారు.
జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి మాదిగపల్లెలో ఘనంగా నిర్వహించేందుకు అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎంఆర్పీఎస్ దిమ్మెల నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు ఇన్‌చార్జిలను నియమించగా, ఉప్పునుంతల మండల బాధ్యతలను భీంపాకుల జంగయ్యకు అప్పగించినట్లు జిల్లా ఇన్‌చార్జి అడేపు నాగార్జున మాదిగ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండెల్లి అంజి మాదిగ, జిల్లా ఇన్‌చార్జిలు నాగార్జున మాదిగ, మద్దిలేటి మాదిగ, రాష్ట్ర నాయకుడు సౌట ఖాసిం మాదిగతో పాటు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


