జయ జయహే తెలంగాణ

Jaya Jaya Telangana– రాష్ట్ర గీతం ..2.30 నిమిషాలు
– భావం మారకుండా కీరవాణి స్వరకల్పన
– తెలంగాణ అధికారిక చిహ్నానికి తుదిరూపం
– గీత రచయిత, చిత్రకారులతో సీఎం సమీక్ష
– కాకతీయ తోరణానికి రేవంత్‌ సూచనలు
– జూన్‌ 2న ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర గీతం ”జయ జయహే తెలంగాణ” గీతాన్ని పలు మార్పులతో ఖరారు చేశారు. తెలంగాణ, అస్థిత్వం, ఆత్మగౌరవం, ప్రతిబింబించేలా 6 నిమిషాల నిడివితో ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ రాసిన ఈ గీతాన్ని రెండు నిమిషాల 30 సెకన్లకు కుదించారు. తెలంగాణ ఔన్నత్యం, భావం, భావోద్వేగం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా సులువుగా రూపొందించారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి ఈ గీతానికి స్వరకల్పన చేశారు. అలాగే తెలంగాణ అధికారిక చిహ్నం తుది రూపం ఖరారైంది. ప్రముఖ చిత్రకారులు రుద్ర రాజేశం తయారు చేసిన 12 చిహ్నాల్లో ఒక దాన్ని ఎంపిక చేశారు. బుధవారం హైదరాబాద్‌లో అధికారిక చిహ్నం, రాష్ట్ర గీతంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన చిహ్నంలో కొన్ని మార్పులు చేయాలని వారికి సూచించారు. గత చిహ్నంలో రాజరిక ముద్రలకు ప్రతీకగా ఉన్న, కాకతీయ తోరణాన్ని మార్చి ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం, త్యాగధనుల బలిదానాలు ప్రతిబింబించేలా కొత్త రూపాన్ని చేర్చనున్నారు. చార్మినార్‌, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగులు మొదలైనవి యధాతధంగా ఉండనున్నాయి. తెలంగాణ ఏర్పడి పదేండ్లు గడుస్తున్న నేపథ్యంలో జూన్‌ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రóహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జయజయహే గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఫ్రొఫెసర్‌ కోదండరామ్‌, అద్దంకి దయాకర్‌, సీఎం సలహాదారు వేం నరెందర్‌రెడ్డి, జేఏసీ నేత రఘు తదితరులు పాల్గొన్నారు.

Spread the love