– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీను నాయక్
నవతెలంగాణ-రంగారెడ్డిడెస్క్
జూన్ 10వ తేదీన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రక్షణన కోసం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనునాయక్ అన్నారు. గురువారం నాడు ఫరూఖ్‌నగర్ మండలంలోని కాశిరెడ్డిగూడ గ్రామంలో ఉపాధి పని చేస్తున్న ప్రదేశంలో వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీను నాయక్ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే కుట్ర పన్నుతుందని, ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఉపాధి హామీలో కనీస పనిదినాలు రెండు వందల రోజులకు పెంచాలని, కొలతలతో సంబంధం లేకుండా రోజుకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలని వివరించారు. వారంవారం కూలి డబ్బులు చెల్లించాలని, పని ప్రదేశంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్టు సౌకర్యం కల్పించాలన్నారు. పని ప్రదేశంలో ప్రమాదం జరిగితే రూ.ఐదు లక్షల ప్రమాద భీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సహాయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శివ దాసన్, తెలంగాణ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య, కార్యదర్శి వెంకట్ రాములు సదస్సుకు హాజరవుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు రాజు, అంజయ్య, వీరయ్య, మంజుల, సువర్ణ, యాదమ్మ, పార్వతమ్మ, అలివేలు, మంగమ్మ, పద్మమ్మ, బుచ్చమ్మ, మాధవి, చెన్నమ్మ, చంద్రమ్మ, దీప, రత్నమ్మ, కె.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.