నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అర్హులు కాగా…వారిలో సుమారు 1.90 లక్షల మందే పోటీపడనున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది ఉంటారని అంచనా. ఆన్‌లైన్‌ విధానంలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుపుతారు. రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే ర్యాంకింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు. ఈసారి కొత్త సిలబస్‌ ఆధారంగా పరీక్ష ఉంటుంది. ఆ సిలబస్‌ను 2021 నవంబరులోనే వెల్లడించారు. పరీక్ష ఫలితాలను ఈనెల 18న వెల్లడిస్తారు. అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ఐఐటీలే కాకుండా దేశవ్యాప్తంగా మరికొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రవేశాలు కల్పిస్తాయి. గత విద్యా సంవత్సరం (2022-23) అన్ని ఐఐటీల్లో 16,598 సీట్లు అందుబాటులో ఉండగా…ఈసారి మరో 200 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు 42 వేల మందిని జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తారు.

Spread the love