పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి గెలుపు ఖాయం

– విస్తృత స్థాయి సమావేశానికి తరలి రావాలి
– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ 
నవతెలంగాణ పెద్దవంగర: వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గెలుపు ఖాయమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని చెర్లపాలెం వాస్తవ్యురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి అమెరికా వదిలి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి వచ్చిందన్నారు. ఆమె అమెరికాలో ఉన్నప్పటికినీ సుదీర్ఘకాలంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే రైతులకు ఒకే దఫా రూ.2 లక్షల రుణమాఫీ, రైతులకు ఎకరానికి ‘రైతు బంధు’ కింద రూ.15వేలు, కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. పొలం లేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు అందించి ఆదుకుంటుందని చెప్పారు. గూడు లేని పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో నాయకులు ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ఝాన్సీ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల
ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, ఉపాధ్యక్షుడు రంగు మురళి, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, ఓరుగంటి సతీష్, బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీతారాం నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈదురు సైదులు, సీనియర్ నాయకులు తోటకూర శ్రీనివాస్, కుందూరు మదన్మోహన్ రెడ్డి, దుంపల శ్యామ్, రెడ్డికుంట తండా సర్పంచ్ జగ్గా బానోత్ నాయక్, కనుకుంట్ల నరేష్, పన్నీరు వేణు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకల సమ్మయ్య గౌడ్, పట్టణ యూత్ అధ్యక్షుడు అనపురం వినోద్, యూత్ ఉపాధ్యక్షుడు పబ్బతి సంతోష్, యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, రంగు అశోక్, రామ్ చరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love