జీవో నెంబర్ 60 ను అమలు చేసి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి..

– సమాన పనికి సమాన వేతనం అందించడంలో సీఎం కేసీఆర్ వైఫల్యం చెందాడు.
నవతెలంగాణ -చివ్వేంల
గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులసమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జన సమితి  మండల పార్టీ అధ్యక్షులు సుమన్ నాయక్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం చివ్వెంల మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపి ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అందించాలని తీర్పు ఇచ్చిన సీఎం కేసీఆర్ పారిశుధ్య కార్మికులకు ఎనిమిది వేలు ఇవ్వడం అన్యాయం అన్నారు. గ్రామపంచాయతీలో పదోన్నతులు లేకపోవడం దారుణం అన్నారు. జీవో నెంబర్ 51 రద్దు చేసి జీవో నెంబర్ 60ని అమలు చేసి మున్సిపల్ కార్మికులతో సమానంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు  సమాన పనికి సమాన వేతనాన్ని కావాలని కోరుకోవడం తప్పా  అని ప్రశ్నించారు. కరోనా కష్ట కాలంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు పోషించిన పాత్ర అమోఘం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి నాయకులు  నరసింహ, బాబు సింగ్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love