ఉద్యోగాల ఊసేదీ?

Job loss?– మంత్రివర్గ నిర్ణయాలపై ఆవేదన
– నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపు
– మూడో వారంలో పార్లమెంటు ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం
– డీఎస్సీ అనుబంధ ప్రకటన ఇవ్వాలంటూ అభ్యర్థుల డిమాండ్‌
– గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను ఏం చేస్తారు…పలువురి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత చూపు ఉద్యోగాల భర్తీపైనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వారు ఎదురుచూస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చింది. మొదటి క్యాబినెట్‌ సమావేశంలోనే మెగా డీఎస్సీని ప్రకటిస్తామని చెప్పింది. ఇంకోవైపు జాబ్‌క్యాలెండర్‌లో భాగంగా ఈనెల ఒకటో తేదీన గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన రెండునెలలు పూర్తయింది. అయినా ఇచ్చిన హామీలేవీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఆదివారం మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయాలుంటాయని నిరుద్యోగులు ఎంతో ఆశించారు. కానీ ఆ దిశగా మంత్రివర్గం చర్చించలేదు. ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈనెల మూడో వారంలో పార్లమెంటు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ రాబోతుందనీ, అందుకనుగుణంగా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ షెడ్యూల్‌ వస్తే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. దీంతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిలిచిపోతుంది. ఇదే అంశం నిరుద్యోగులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు నోటిఫికేషన్లను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈనెల ఎనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు ఇస్తుందో చూడాలి.
డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌ వచ్చేనా?
పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌ వస్తుందా? లేదా? అన్న ఆందోళన అభ్యర్థులను వేధిస్తున్నది. ఒకవేళ ఎన్నికల కోడ్‌ వస్తే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ఆలస్యమవుతుంది. అందుకే వెంటనే అనుబంధ నోటిఫికేషన్‌ ఇవ్వాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లాస్థాయి నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ గతేడాది సెప్టెంబర్‌ ఆరో తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే మరో ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను కలిపి పది వేల ఉపాధ్యాయ పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఇందుకోసం డీఈవోల నుంచి వివరాలను సేకరిస్తున్నది. ఈ ఏడాదిలో సుమారు 3,800 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందుతారు. ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియను చేపట్టాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి ఆమోదం తీసుకుని డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశముందని తెలిసింది. రాష్ట్రంలో 1.22 లక్షల ఉపాధ్యాయ పోస్టులున్నాయి. 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. 19 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యమైతే వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి విద్యావాలంటీర్లను నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
గ్రూప్‌-1పై ఏం చేద్దాం? :టీఎస్‌పీఎస్సీ తర్జనభర్జన
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను ఏం చేయాలనే దానిపై టీఎస్‌పీఎస్సీ తర్జన భర్జన పడుతున్నది. హైకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలా? లేదంటే సుప్రీం కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి తీర్పు వచ్చే వరకు వేచిచూడాలా? అన్నది ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. టీఎస్‌పీఎస్సీకి కొత్తగా చైర్మెన్‌, సభ్యులను కాంగ్రెస్‌ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అంశంపై న్యాయనిపుణుల సలహాలను తీసుకుంటున్నది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 2022. ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్‌-2 రాతపరీక్షలు పలు కారణాలతో మూడుసార్లు వాయిదా పడ్డాయి. టీఎస్‌పీఎస్సీకి కొత్త పాలకమండలి రావడంతో రాతపరీక్షల తేదీలను ప్రకటించే అవకాశమున్నది. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ 29న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ తొలి గ్రూప్‌-3 ద్వారా 1,388 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022, డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గ్రూప్‌-3 రాతపరీక్షల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష గతేడాది జులై ఒకటిన నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ కోసం 2022, డిసెంబర్‌ ఒకటిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ కసరత్తును వేగవంతం చేసింది.

Spread the love