సరిహద్దులో ఉమ్మడి ఎక్సైజ్ దాడులు

నవతెలంగాణ – అశ్వారావుపేట
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా సోమవారం సరిహద్దు గ్రామాల్లో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం అంకం పాలెం లో 50 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.ముందుగా అంతరాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కరంచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారుల సహాకారంతో తెలంగాణలోకి అక్రమ మద్యం, నాటు సారా, గంజాయి లాంటి మత్తు పదార్థాల సరఫరా నియంత్రణకు కార్యచరణ చేపట్టినట్లు వివరించారు. ఇందుకు గాను ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామని, సరిహద్దు చెక్ పోస్ట్ లను బలోపేతం చేస్తూ నిఘాను పటిష్టం చేసినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో నిత్యం ఉమ్మడి ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఎక్సైజ్ నేరాల నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం ఎస్ఈబీ సీఐ లు సాంబమూర్తి, పట్టాభి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love