సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం
నవతెలంగాణ-హైదరాబాద్
నేటి డిజిటల్ యుగంలో జర్నలిజం వేగంగా మారుతున్న నేపథ్యంలో మీడియా వృత్తిదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ, మీడియా అకాడమీ చైర్మెన్ కె శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో మంగళవారం నిర్వహించిన జర్నలిస్టుల చర్చా కార్యక్రమం జరిగింది. పలువురు సీనియర్ జర్నలిస్టులు, అకాడమీకి అనుబంధ సభ్యులు పాల్గొని మీడియా రంగ భవిష్యత్ దిశ, డిజిటలైజేషన్, మీడియా చట్టాలు, శిక్షణ కార్యక్రమాలు, జర్నలిస్టుల సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ జి. ముకుంద్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం డిగ్రీ చదివే రోజుల్లో పత్రికల ఎడిటోరియల్స్ చదవడం ద్వారా సివిల్ సర్వీసులపై ఆసక్తి పెరిగిందనీ, అదే తన విజయానికి పునాది అయిందని తెలిపారు. నేడు మీ అందరి ముందుకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు ఐ. వెంకట్ రావు మాట్లాడుతూ మరిన్ని పుస్తకాలను అకాడమీకి అందజేస్తానని తెలిపారు.
మాజీ ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్ మాట్లాడుతూ జర్నలిజం తనకు ధైర్యం, గుర్తింపు ఇచ్చిందన్నారు. ఉదుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక జర్నలిజానికి అనుగుణంగా అకాడమీ డిజిటల్ క్లాసులు, ఇంక్యూబేటర్ ఏర్పాటు చేయాలన్నారు. గ్యాగ్ ఆర్డర్ వంటి అంశాలపై చర్చలు నిర్వహించాలని సూచించారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ 16 మంది వెటరన్ జర్నలిస్టుల వీడియోలను పుస్తకాల రూపంలో తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సభ్యులు మీడియా రంగంలో కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం పెరుగుతున్నదనీ, జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆధునిక శిక్షణా కార్యక్రమాలు, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాములు, డెస్క్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. అకాడమీ భవనంలోని డిజిటల్ సదుపాయాలు, ఆధునిక ఆడిటోరియం, బోర్డు రూమ్, లైబ్రరీ, కంప్యూటర్ రూమ్ వంటి వసతులను మరింత సమర్థవంతంగా వినియోగించి జర్నలిస్టులకు ప్రయోజనం కలిగించాలని అభిప్రాయపడ్డారు. పాత పత్రికలు, అరుదైన పుస్తకాలు, నిజాం కాలం నాటి ప్రచురణలు, తెలుగు గ్రంథాలు తదితరాలను డిజిటలైజ్ చేసి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.
పలువురు సీనియర్ జర్నలిస్టులు తమ వద్దనున్న విలువైన పుస్తకాలను మీడియా అకాడమీ లైబ్రరీకి విరాళంగా అందిస్తామని తెలిపారు. సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ మీడియా చట్టాలలో కాలానుగుణంగా మార్పులు అవసరమనీ, సోషల్ మీడియాకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళి తీసుకురావాలని పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులు, గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జర్నలిజం అనేది సమాజానికి అద్దం పట్టే వృత్తి అని, భయపడకుండా నిజాయితీతో వార్తలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మీడియా అకాడమీ 1996 నుంచి జర్నలిస్టుల అభివృద్ధికి విశేష సేవలు అందిస్తోందని, పుస్తక ప్రచురణలు, మోనోగ్రాఫ్‌లు, శిక్షణా కార్యక్రమాలు మీడియా రంగానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అభినందించారు.ఈ చర్చా కార్యక్రమంలో కె. రాంచందర్ మూర్తి, కేశవరావు దాసు, ఎస్. నాగేష్ కుమార్, బండారు శ్రీనివాస్ రావు, రవీందర్ ఎం.పీ, రెడ్డి, మాడభూషి శ్రీధర్, ఎం. సుబ్బారావు, జగన్, ఆర్.వి. రామారావు, ఎస్. వినయ్ కుమార్, వై. నరేందర్ రెడ్డి, విరాహత్ అలీ, తదితరులు పాల్గొని మీడియా రంగంలో వస్తున్న మార్పులు, డిజిటలైజేషన్, జర్నలిస్టుల శిక్షణ, మీడియా చట్టాలు, సోషల్ మీడియా ప్రభావం, పుస్తక ప్రచురణలు, అకాడమీ భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, శిక్షణ, డిజిటలైజేషన్, మీడియా ఆధునీకరణ దిశగా అకాడమీ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ప్రముఖులందరిని అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి శ్రీ నాగులపల్లి వెంకటేశ్వర రావు సంయుక్తగా శాలువాలతో సత్కరించారు.
పాత్రికేయులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



