పెద్దపల్లి జిల్లాలో అమానుషం
ఆలయంలోకి రావొద్దంటూ గేటుకు తాళం వేసిన
గౌడ కులస్తులు
ఎండలో బోనాలతో
దళిత మహిళల పడిగాపులు
రోడ్డుపై బైటాయించి నిరసన
రంగంలోకి దిగిన డీసీపీ రామ్‌రెడ్డి, పోలీసులు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / సుల్తానాబాద్
శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాజం ఎంతగా దూసుకుపోతున్నా.. మనుషుల మనసుల్లో వేళ్లూనుకుపోయిన కులజాఢ్యం ఇంకా పీడకలలా వెన్నాడుతూనే ఉంది. దేవుడి ముందు అందరూ సమానమే అన్న నానుడి ఉన్నా.. ఆలయంలోకి వెళ్లేందుకు కులం అడ్డుగోడగా నిలుస్తోంది. దళిత మహిళలను బోనాలతో గుడిలోకి రాకుండా అడ్డుకున్న అమానుష ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో మంగళవారం జరిగింది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వెళ్లిన దళిత మహిళలను అడ్డుకుని గుడి తలుపులు మూసేశారు.
పెగడపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం దళిత మహిళలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. అయితే, దళితులు తమతో సమానంగా గుడిలోకి రావొద్దంటూ గౌడ సామాజిక తరగతిలోని కొందరు ఆలయం గేటుకు తాళం వేశారు. బోనాలతో వచ్చిన దళిత మహిళలను బయటే నిలబెట్టారు. ‘మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడి ఎండలో నిలబడ్డాం. కనీసం గుడిలోకి వెళ్లనీయకుండా తాళాలు వేశారు’ అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గుడిలోనికి వెళ్లనీయకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ.. పెగడపల్లి ప్రధాన రహదారిపై బోనాలు పెట్టి రాస్తారోకో చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దళిత సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకుని.. వివక్ష చూపిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రంగంలోకి డీసీపీ, పోలీసు బృందాలు
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి, సుల్తానాబాద్ సీఐ రంజిత్ రెడ్డి, పలువురు ఎస్‌ఐలు భారీ పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు గ్రూపులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. ఈ సందర్భంగా డీసీపీ రామ్‌రెడ్డి దళితులకు భరోసా కల్పిస్తూ కులవివక్షపై తీవ్రంగా స్పందించారు. ‘నేను కూడా గిరిజన బిడ్డనే. చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో కచ్చితంగా తీసుకుంటాం. చట్టం అందరికీ సమానమే. సమాజంలో కుల వివక్ష చూపకూడదు. బాధ్యులెవరైనా ఉపేక్షించేది లేదు’ అని హెచ్చరించారు.



