– జర్నలిజం హుందాగా భావించాలి
– డీఎస్పీ, డీపీఆర్‌ఓ
నవతెలంగాణ-కొత్తగూడెం
జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా వెలికి తీసి రాయాలని, అప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని, అది పాత్రికేయ వృత్తికి హుందా తనాన్ని తెచ్చిపెడుతుందని కొత్తగూడెం డీఎస్పి రెహమాన్, జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపీఆర్‌ఓ)లు శీలం శ్రీనివాసరావు సూచించారు. బుధవారం జర్నలిస్ట్ డే సందర్భంగా కొత్తగూడెం ప్రెస్ క్లబ్‌లో పలువురు జర్నలిస్టులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిజం కత్తి మీద సాము లాంటిది అన్నారు. నేడు సోషల్ మీడియా వలన జర్నలిజానికి నాణ్యత తగ్గిందన్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు జర్నలిస్టుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని నిర్మూలించాల్సిన బాధ్యత జర్నలిస్టుమీద ఉందన్నారు. జర్నలిజాన్ని సమాజ హితం కోసం ఉపయోగించాలని, నిజాన్ని నిర్భయంగా బయటపెట్టాలని అన్నారు. అప్పుడే పాత్రికేయులకు నిజమైన గౌరవం దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వన్ టౌన్ సిఐ నరేందర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.