జూన్‌ 9 గడువు

– అప్పటిలోగా బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలి
– లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం
– రైతు నేతల హెచ్చరిక
– రెజ్లర్లకు 1983 క్రికెట్‌ ప్రపంచ కప్‌ గెలిచిన జట్టు మద్దతు
న్యూఢిల్లీ : డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేసేందుకు జూన్‌ 9 వరకు రైతు నేతలు గడువు విధించారు. లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీ సహా వివిధ ప్రాంతాల నుంచి పలువురు రైతులు, రైతుల సంఘాల ప్రతినిధులు హర్యానాలోని కురుక్షేత్రలో జాట్‌ ధర్మశాలలో సమావేశమయ్యారు. బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులపై పోరాడుతున్న రెజ్లర్‌లకు సంఘీభావం తెలుపుతూ.. రైతు సంఘాలు యూపీ, పంజాబ్‌, హర్యానాలలోనూ వరుసగా నిరసనలు చేశాయి.
రైతు నేత రాకేశ్‌ టికాయిత్‌ మాట్లాడుతూ.. ”ఈ అంశంపై చర్చను ప్రారంభించడానికి మేము ప్రభుత్వానికి జూన్‌ 9 వరకు సమయం ఇస్తున్నాము. జూన్‌ 9 తర్వాత ఈ కుమార్తెలకు (మహిళా రెజ్లర్లు) మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, పంచాయితీలు నిర్వహిస్తాం” అని అన్నారు. ”వారి (మల్లయోధుల) కుటుంబాలకు బెదిరింపులు వస్తున్నాయి. కాబట్టి వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలనీ, లేదంటే నిరసనలు ఎదుర్కోవాలని కేంద్రాన్ని హెచ్చరించారు.1983లో క్రికెట్‌ ప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టు.. నిరసనకారులకు మద్దతు ఇస్తుందనీ, వారి మనోవేదనలను తప్పనిసరిగా పరిష్కరించాలని పేర్కొన్నది. నిరసన తెలిపిన మల్లయోధులపై ప్రభుత్వ చర్య హదయ విదారకమైనది, భయంకరమైనదని వివరించింది. మాజీ భారత క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ సైతం రెజ్లర్లకు మద్దతుగా నిలిచారు. రెజ్లర్లకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలని తెలిపారు.
వెనక్కు తగ్గిన బ్రిజ్‌ భూషణ్‌
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ సోమవారం అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ వాయిదా పడింది. తనకున్న మద్దతును చూపించుకునేందుకు ఆయన ఈ ర్యాలీని నిర్వహించాలనుకున్నారు. కాగా, వాయిదా విషయాన్ని బ్రిజ్‌ భూషణ్‌ ఫేస్‌బుక్‌ ప్రకటన ద్వారా వెల్లడించారు. ” జూన్‌ 5న సాధువుల ఆశీస్సులతో ‘జన చేతన్‌ మహార్యాలీ’ని నిర్వహించాలనుకున్నాను. అయితే ప్రస్తుతం నాపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కొన్ని రోజుల పాటు దీనిని వాయిదా వేస్తున్నాను” అని బ్రిజ్‌ భూషణ్‌ వివరించారు. అయితే ఆయన ర్యాలీకి యూపీ సర్కారు అనుమతివ్వలేదని సమాచారం.

Spread the love