ఆ..ఒక్కటీ అడక్కు

That..just ask– ఒకే రకం పత్తి విత్తనాలపై రైతుల ఆసక్తి
– ఇచ్చేందుకు దుకాణాదారుల తిరకాసు
– మరో రకాన్ని అంటగడుతున్న వైనం
– అదును రాకముందే అగచాట్లు.. సొమ్ము చేసుకుంటున్న డీలర్లు
– వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
– 60 మి.మీ వర్షం కురిస్తేనే విత్తాలంటున్న నిపుణులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అదును రాకముందే రైతుల్లో ఆందోళన మొదలైంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే కావాల్సిన పత్తి విత్తనాలు లభిస్తాయో.. లేదోనని రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. విత్తనాల కోసం బారులు తీరిన రైతులు.. వాటి కోసం పోలీసులు బందోబస్తు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు.. రైతులకు కావాల్సిన విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి’ అని ప్రభుత్వం చెబుతోంది. కాగా, డిమాండ్‌ ఉన్న విత్తన రకానికి తోడు మరో రకాన్ని అంటగడుతున్నారు. రైతులు ఎక్కువగా అడిగే విత్తన రకాన్ని కొన్నిచోట్ల బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. మరోవైపు తక్కువ రేటంటూ రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు.
తెలంగాణలో వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. రాష్ట్రంలో 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా. దీనిలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది రోహిణి కార్తె ముందు నుంచే చెదురుమదురు వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. పత్తి విత్తనాలు నాటేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. సరైన పదును కాకుండా గింజలు నాటొద్దని.. కనీసం 60 మి.మీ వర్షపాతం నమోదుకాకుంటే విత్తనాలు మొలకెత్తవని వ్యవసాయ అధికారులు చెబుతున్నా.. రైతులు మాత్రం వినడం లేదు. రెండు, మూడేండ్లుగా మే నెలలోనే వర్షాలు కురవటం…ఆ తర్వాత మొఖం చాటేస్తున్నా రైతుల తీరు మారట్లేదని అధికారులు చెబుతున్నారు. అదును కాకముందే విత్తనాలు వేస్తుండటంతో అవి దెబ్బతింటున్నాయి. ఇలా చేయడం వల్ల రెండు, మూడుసార్లు విత్తనాలు వేయాల్సి వస్తోంది. దాంతో రైతులకు కావాల్సిన విత్తన రకాల కొరత ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది తమకు కావాల్సిన విత్తన రకాల కోసం రైతులు తిప్పలుపడుతున్నారు. ముందే కొనుగోలు చేయాలనే ఆత్రుతతో అదనపు ధర వెచ్చిస్తున్నారు. ఫలితంగా డిమాండున్న 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్‌ ధర రూ.864 ఉండగా, కొన్నిచోట్ల అప్పుడే రూ.1,500కి పైగా ధరకు విక్రయిస్తున్నారు. లేదంటే అడిగిన విత్తన రకంతో పాటు మరో రకం విత్తన ప్యాకెట్లనూ అంటగడుతున్నారని రైతులు వాపోతున్నారు.
పొరుగు జిల్లాలు.. వేరే ప్రాంతాల నుంచి రాకతో కొరత
రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర జిల్లాలు, రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుండటం తో ఆయా జిల్లాలు, రాష్ట్రాల నుంచి రైతులు తెలంగాణలోని వివిధ పట్టణాలకు వచ్చి పత్తి విత్తనాలను కొనుగోళ్లు చేస్తున్నారు. డిమాండ్‌ ఉన్న విత్తనాలను అవసరమైతే అదనపు ధర వెచ్చించి మరీ కొంటున్నారు. దీనివల్ల స్థానికంగా కొరత ఏర్పడుతోంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 50కి పైగా నాణ్యమైన పత్తి విత్తన రకాలు అందుబాటులో ఉన్నా రైతులు నాలుగైదు రకాలపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఒకరకం విత్తనాన్నే ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా అడుగుతున్నారు. ఆ రకం విత్తనాల కోసం విత్తన డీలర్లు, దుకాణాదారులు, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి చెందిన రైతులు ఓ కంపెనీ సీడ్స్‌ కోసం పదుల సంఖ్యలో ఏకంగా జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయానికి మంగళవారం వచ్చారు. గతేడాది ఆ రకం విత్తనాన్ని సాగు చేయడంతో ఎకరానికి 15 క్వింటాలకు పైగా దిగుబడి వచ్చిందని చెబుతూ.. తిరిగి అవే విత్తనాలను ఇప్పించాలని అధికారపార్టీ నేతలతో అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై వ్యవసాయ అధికారి సరిత ప్రభుత్వం ధ్రువీకరించిన అనేక రకాల బీటీ పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ఏదైనా సత్ఫలితమే ఇస్తుందని సూచించినా రైతులు మాత్రం తమకు అదే రకం కావాలని పట్టుబడుతుండటం కనిపించింది. రైతుల ఆకాంక్షను అధికారులు.. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. బాగా కొరత ఏర్పడితే డిమాండ్‌ లేని ప్రాంతాల నుంచి ఆ విత్తనాలను జిల్లాకు తీసుకొద్దామని చెప్పినట్టు సమాచారం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి సాగు.. విత్తన లభ్యత..
ఖమ్మం జిల్లాలో మొత్తం 7.03 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. దీనిలో వరి తర్వాత అధికంగా పత్తినే సాగు చేస్తున్నారు. 2,01,834 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా. దీని కోసం 5 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను జిల్లాలో అందుబాటులో ఉంచారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో 2.2 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తుండగా 2,47,044 పత్తి విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. దీనిలో సుమారు 30వేల ప్యాకెట్లు ఇప్పటికే విక్రయించారు. కానీ ఉమ్మడి జిల్లాలో రకరకాల నేలలు ఉన్నాయి. ఎర్రనేలల్లోనూ నల్లరేగడికి సూట్‌ అయ్యే ఒకే ఒక విత్తన రకాన్ని రైతులు ఎక్కువగా ఆశిస్తుండటం గమనార్హం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8.50లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగుచేస్తారు. ఎకరాకు కేజీన్నర పత్తి విత్తనాల అవసరం ఉంటుంది. అయితే మార్కెట్‌లో 70శాతం విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
నాణ్యమైన పత్తి విత్తనాలేవైనా పది క్వింటాళ్లకు పైగా దిగుబడి : మోర కోటిరెడ్డి, రైతు, మేడిదపల్లి
ఒకే రకం పత్తి విత్తనం కోసం అందరూ ఎగబడుతుండటంతో బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. సాధారణంగా రూ.864కు లభించే ఆ విత్తన ప్యాకెట్‌ను రూ.1500కు కొంటున్నారు. నేను 12 ఎకరాల్లో పత్తి వేస్తున్నా. కానీ ఒక్క ప్యాకెట్‌ కూడా ఆ విత్తన రకాన్ని తీసుకోలేదు. నాణ్యమైన పత్తి విత్తన రకాల్లో ఓ మూడింటిని తీసుకున్నా. ఎకరానికి పది క్వింటాళ్లకు పైగా దిగుబడి ప్రతి ఏటా సాధిస్తున్నా. విత్తనాన్ని బట్టి కాదు వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులను బట్టి దిగుబడి ఉంటుందని నా అభిప్రాయం.

Spread the love