బీఆర్‌ఎస్‌ పాలన పోతేనే నిరుద్యోగులకు న్యాయం

బీఆర్‌ఎస్‌ పాలన పోతేనే నిరుద్యోగులకు న్యాయం– ప్రొఫెసర్‌ పీ.ఎల్‌.విశ్వేశ్వర్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలన పోతేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని టీజేఎస్‌ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ పీ.ఎల్‌.విశ్వేశ్వర్‌ రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయతో పాటు నిరుద్యోగ చైతన్య యాత్ర కో ఆర్డినేటర్లు మాసంపల్లి అరుణ్‌ కుమార్‌, సయ్యద్‌ సలీమ్‌ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌ రావు మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణలో అత్యధిక నిరుద్యోగం ఉందని విమర్శించారు. టీయస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో పత్రాలు లీక్‌ కాలేదనీ, అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులతో పబ్లిక్‌ కమిషన్‌ను నింపారని తెలిపారు. రాష్ట్రంలో బాధ్యాతాయుతమైన ప్రభుత్వం లేదని దుయ్యబట్టారు. మాసంపల్లి అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ తొమ్మిదేండ్లలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించలేదనీ, నిరుద్యోగ భృతి ఇవ్వలేదనీ, కేవలం ఎన్నికల కోసం మళ్లీ జాబ్‌ క్యాలెండర్‌ అంటూ కేటీఆర్‌ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల ముందు 2017లోనూ కేటీఆర్‌ ఇవే మాటలు చెప్పి అమలు చేయలేదని గుర్తుచేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌లను నిరుద్యోగులను నమ్మే ప్రసక్తే లేదనీ, కాంగ్రెస్‌ ను గెలిపిస్తారని తెలిపారు. 200 మందికి పైగా నిరుద్యోగులు మరణిస్తే, ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించని వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సయ్యద్‌ సలీం పాషా మాట్లాడుతూ జాబ్‌ క్యాలెండర్‌, 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ ఇచ్చిన కాంగ్రెస్‌కు నిరుద్యోగులు ఆకర్షితులయ్యారని తెలిపారు. దీంతో హడావుడీగా కేటీఆర్‌ నిరుద్యోగుల కాళ్ల దగ్గర సాగిలపడినట్టు డ్రామాలు మొదలెట్టారని విమర్శించారు. ఖాళీలను భర్తీ చేయలేని అసమర్థ బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగి వెంకటరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు కానీ వారితో ముచ్చట్లు పెట్టి నిరుద్యోగులతో ఇంటరాక్ట్‌ అయినట్టు కేటీఆర్‌ అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నిరుద్యోగులు అశోక్‌ నగర్‌, చిక్కడపల్లి లైబ్రరీ, ఒయు తదితర యూనివర్సిటీల్లో ఉన్నారని తెలిపారు. నిజంగా కేటీఆర్‌కు దమ్ముంటే అక్కడికి రావాలని నాయకులు సవాల్‌ చేశారు.

Spread the love