కవి, గాయకుడు జయరాజ్‌కు ‘కాళోజీ’ అవార్డు

'Kaloji' award to poet and singer Jayaraj– ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌
– 9న కాళోజీ జయంతి కార్యక్రమంలో ప్రదానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పద్మ విభూషణ్‌ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రకటించే ”కాళోజీ నారాయణ రావు అవార్డు”-2023 ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌కు దక్కింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కవి జయరాజ్‌ను ఎంపిక చేశారు. ఈనెల 9న శనివారం కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో జయరాజ్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. దీని ద్వారా రూ.1,01,116 నగదు రివార్డు, జ్జాపికను అందించి దుశ్శాలువాతో సత్కరిస్తారు. ఉమ్మడి వరంగల్‌, నేటి మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన జయరాజ్‌ (60) చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన ఆయన వివక్షత లేని సమసమాజం కోసం సాహిత్యాన్ని సృజించారు. బుద్ధుని బోధనలకు ప్రభావితమై అంబేద్కర్‌ రచనలతో ఆయన స్పూర్తి పొందారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లెనా తిరుగుతూ ఆయన ఆట, పాట, గానం ద్వారా ప్రజల్లో సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రచించారు. మనిషికీ ప్రకృతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని ఆయన తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. ఆయన ముద్రించిన పలు పుస్తకాలు ప్రజాదరణ పొందాయి.

Spread the love