ముగ్దూంపూర్ లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘పొలంబాట’ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గంలో పయనమైన కేసీఆర్ కు సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి కేసీఆర్ ముగ్దూంపూర్ కు చేరుకుని, అక్కడి రైతులతో మాట్లాడారు. ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతోందని కేసీఆర్ కు రైతులు తెలిపారు. రైతుల ఇబ్బందులపై స్పందించిన కేసీఆర్… రైతన్నలకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ తీరుపై రైతులు ధైర్యంగా పోరాటం చేయాలని… రైతులకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని తెలిపారు. అక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటకి బయల్దేరారు. ఆయన ఇంట్లో కేసీఆర్ భోజనం చేస్తారు. అనంతరం బోయినపల్లి మండలంలో ఎండిపోయిన పంటను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మిడ్ మానేరు రాజరాజేశ్వర జలాశయం వద్దకు వెళ్లి పరిశీలిస్తారు. అనంతరం సిరిసిల్లకు చేరుకుని అక్కడ మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారని చెపుతున్నారు.

Spread the love