కేసీఆర్‌ ఇంటికే..

KCR at home..– పదేండ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ది అవినీతే
– బీజేపీ చేసిన లక్షల కోట్ల అప్పుతో దేశం దివాళా
– బీసీ డిక్లరేషన్‌లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య
– కామారెడ్డి భూములపై కేసీఆర్‌ కన్ను : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
– కామారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌
నవతెలంగాణ-కామారెడ్డి
కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్‌ సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో ఓట్లు కొంటున్నారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ తరపున సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ తరపున రేవంత్‌రెడ్డి రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, రెండు చోట్ల రేవంత్‌ విజయం సాధిస్తారని అన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని, కేసీఆర్‌ను ఇంటికి పంపించడానికి ప్రజలు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కామారెడ్డిలో శుక్రవారం రేవంత్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌ సభలో కర్నాటక సీఎం సిద్ధ రామయ్య హాజరై ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదన్నర ఏండ్లలో రూ.125 లక్షల కోట్ల అప్పుచేసి దేశాన్ని దివాళా తీయించారని విమర్శించారు. బీజేపీ నాయకులు మోడీని నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, మోడీ చరిష్మా ఎక్కడా పని చేయదన్నారు. కర్నాటక ఎన్నికల సమయంలో బీజేపీ.. 40 బహిరంగ సభలు, భారీ ర్యాలీలు.. ఎక్కడెక్కడ నిర్వహించిందో.. అక్కడ కాంగ్రెస్‌ పార్టీకి అధిక ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీసీలను ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే ఆని అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఇచ్చిన 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేసి చూపిస్తామని స్పష్టంచేశారు.
పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డికి బూచోడు వస్తున్నాడని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. గెలిపిస్తే కామారెడ్డిని బంగారు తునక చేస్తానని కేసీఆర్‌ అంటున్నారని, బంగారం చేయడం కాదు కదా పచ్చని పొలాలు న్న భూములను లాక్కుంటాడని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తనను నోటుకు ఓటు కేసులో ఇరికిచ్చి జైలు పాలు చేసింది కేసీఆర్‌ అని, అలాంటి వ్యక్తిని ఎవరూ నమ్మొ ద్దని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలోని కోనాపూర్‌ తాను పుట్టిన ఊరన్న సంగతి ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌కు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ తనను మూడోసారి సీఎం చేయమని అడుగుతున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకా, 17 సార్లు పరీక్షలు నిర్వహించి పేపర్‌ లీకేజీ చేసినందు కా, భూములను కబ్జాలు చేస్తున్నందుకా, ఇసుక మాఫియాను నడిపిస్తున్నందుకా.. దేనికోసమని ప్రశ్నించారు. కామారెడ్డి నుండి కేసీఆర్‌ గెలిస్తే కామారెడ్డి ప్రజలు నష్టపోతారని ఆలోచించిన షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ అధిష్టానం నన్ను కామారెడ్డి నుంచి పోటీ చేయమని కోరితే ఇక్కడికి వచ్చానని తెలిపారు. కేసీఆర్‌కు పోటీ చేయాలనుకుంటే బీసీ వ్యక్తి గంప గోవర్ధన్‌ ఉన్న కామారెడ్డి నియోజకవర్గమే కనిపించిందా? కొడుకు ఉన్న సిరిసిల్ల, అల్లుడు ఉన్న సిద్దిపేట కనిపించలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం 21, 22 ప్యాకేజీలను తొందరగా పూర్తి చేసి 3.60 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు.
రేవంత్‌ రెడ్డి నామినేషన్‌కు కేసీఆర్‌ పూర్వీకుల గ్రామస్తుల విరాళం
కేసీఆర్‌ పూర్వీకుల గ్రామమైన కొనాపూర్‌కు చెందిన ప్రజలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కోసం విరాళాలు అందచేశారు. ఈ విరాళాన్ని రేవంత్‌ రెడ్డి తన నామినేషన్‌ పత్రాల సమర్పణకు వినియోగించటం విశేషం.
బీసీ డిక్లేరేషన్‌ ముఖ్యాంశాలు
జనాభా, కులగణన ఆధారంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెనుకబడిన బీసీలకు బీసీ డిక్లరేషన్‌ అమలు
ఐదేండ్లలో బీసీల అభివృద్ధి కోసం లక్ష కోట్లు కేటాయింపు
వెనుకబడిన తరగతుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీలకు రిజర్వేషన్ల పెంపు
లోకల్‌ బాడీస్‌లో ఇప్పటివరకు 23 శాతం ఉన్న రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు,
ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల్లో 32 శాతం రిజర్వేషన్‌ కల్సన
ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ మాదిరిగా బీసీలకు మహాత్మా జ్యోతిబాపూలే సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు, ప్రతి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయింపు
చేతివృత్తుల వారు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి రూ.10 లక్షల లోన్‌, జిల్లా కేంద్రాల్లో వృత్తిబజార్ల పేరుతో 50 దుకాణాల సముదాయాలు ఏర్పాటు
ప్రతి జిల్లాలో రూ.50 కోట్లతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరుతో బీసీ ఐక్యవేదిక భవనాల నిర్మాణాలు
ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో బీసీ గురుకులాలు
కుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ప్రతి సంఘానికి రూ.10 లక్షలు అందజేత
బీసీ కార్మికులకు 50 ఏండ్లకే వృద్ధాప్య పెన్షన్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన 1902, 2009 జీవోలని అమలు చేస్తూ బీసీ (డీ)లో ఉన్న ముదిరాజులను బీసీ-ఏ లోకి మార్పు
మత్స్య కార్మికులకు తెలంగాణ ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ తరపున చేపలు పెంచుకోవడానికి యూనిట్లకు 90 శాతం ఉచిత నిధులు

Spread the love