కోర్టు ముందుకు కేజ్రీవాల్‌..

నవతెలంగాణ – ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన వ్యవహారంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్‌ కోరారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇచ్చిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్‌ విచారణకు సహకరించడం లేదంటూ రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ (ED) ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఎంకు సమన్లు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయన నేడు కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరయ్యారు.
ఇదిలా ఉండగా.. అసెంబ్లీలో కేజ్రీవాల్‌ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై నేడు చర్చ జరగనుంది. అనంతరం దీనిపై ఓటింగ్‌ చేపట్టనున్నారు. ‘తప్పుడు కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల్లోని పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం మనం చూస్తున్నాం. మద్యం పాలసీ కేసు సాకుతో ఆప్‌ నేతల్ని అరెస్టు చేయాలని వారు భావిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరూ విడిపోలేదని ప్రజలకు చూపించేందుకు నేను విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా’’ అని కేజ్రీవాల్‌ తెలిపారు.

Spread the love