జీవన్ రెడ్డి కీలక ప్రకటన…

నవతెలంగాణ జగిత్యాల: ‘రాజీనామా సస్పెన్స్’కు తెరదించుతూ కాంగ్రెస్ సీనియర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని ఆయన ప్రకటించారు.
‘‘ నేను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. చేరికల విషయంలో మనస్థాపం చెందాను. నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎమ్మెల్సీగా అసెంబ్లీకి వెళ్లే హక్కు నాకు ఉంది. నా కార్యకర్తలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను’’ అని జీవన్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చల అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.
ఫలించిన మంత్రాంగం     
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చల అనంతరం జీవన్ రెడ్డి తన పట్టు వీడారు. అనంతరం తాను కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకటన చేశారు. దీంతో భట్టి, శ్రీధర్ బాబుల మంత్రాంగం ఫలించింది.
మంత్రి పదవి ఆఫర్
ఈ ప్రభుత్వం నడవడం కోసం వారి ఆలోచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియార్టీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యమిచ్చి గౌరవిస్తుందని భట్టి ప్రకటించారు. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదని, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మనస్థాపం చెందితే తామంతా బాధపడతామని చెప్పారు. కాగా జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి పదవి ఆఫర్ చేసిందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Spread the love