యువతిపై కత్తిపీటతో దాడి

యువతిపై కత్తిపీటతో దాడి– నిందితుడి అరెస్ట్‌
నవతెలంగాణ- చాంద్రాయణగుట్ట
తనతో కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిపిన యువతి.. ఆ తర్వాత దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి ఆమెపై కత్తిపీటతో దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రినాక ఎస్‌ఆర్‌టీ కాలనీలో నివాసం ఉంటున్న బాధితురాలు కాస్మోటిక్స్‌ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తున్నది. ఆమె తల్లి కూడా బయట పనికి వెళ్తుంది. బాధితురాలికి ఐదేండ్ల కిందట అశ్రద్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అనంతరం ఇరువురూ విడాకులకు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఇదిలా ఉండగా, బాధితురాలు హరిబౌలి నివాసి, తన స్కూల్‌ మిత్రుడైన మణికంఠతో ప్రేమ వ్యవహారం నడిపింది. అయితే, కొన్ని రోజులుగా మణికంఠకు కూడా ఆమె దూరంగా ఉంటోంది. అది తట్టుకోలేని మణికంఠ మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చి డోర్‌ పెట్టాడు. ఆ సమయంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో కోపోద్రికుడైన మణికంఠ అక్కడే ఉన్న కత్తిపీటతో ఆమెపై దాడి చేశాడు. కింద పడేసి తలపై గట్టిగా కొట్టి.. గొంతు కోయడానికి ప్రయత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో.. ఇంటి యజమాని వచ్చి డోర్‌ తీశాడు. మణికంఠ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అంతలోనే బస్తీ వాసులు అక్కడకు చేరుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఛత్రినాక ఎస్‌ఐ శోభ, ఇతర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని అస్రా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love