నేటి తరాలకు చెరగని స్ఫూర్తి ‘కొరటాల’

చరిత్ర నిర్మాతలు ప్రజలే. వారిని ఉద్యమాల బాట పట్టించినవారిలో అనేక మంది ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకతలు కొందరి స్వంతం. వ్యక్తుల పాత్రను విస్మరించలేం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న నేతలలో కొరటాల సత్యనారాయణ ఒకరు. క్యాన్సర్‌తో 2006 జూలై ఒకటిన మరణించిన కొరటాల అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా అంతకు ముందు రైతు, వ్యవసాయకార్మిక సంఘాల కార్యదర్శిగా పని చేశారు. చేనేత, యువజన, విద్యార్థి, మహిళా ఉద్యమాలకు మార్గదర్శిగా, ప్రజాశక్తి సాహితీ సంస్థ అధ్యక్షుడిగా, శాసనసభ్యునిగా కూడా సేవలందించారు. వామపక్ష, కమ్యూనిస్టు ఉద్యమాలలో, పత్రికల నిర్వహణలో భాగస్వాములుగా ఉన్న నేటితరాలు కొరటాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం.
పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య తరం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల సీపీఐ(ఎం), వివిధ ప్రజాసంఘాలలో నాయకత్వ స్థానాల్లో ఉన్న నేటి తరాలకు ఒక వారధిగా కొరటాల పని చేశారంటే అతిశయోక్తి కాదు. తనకంటే సీనియర్లుగా ఉన్నవారితో, ఎంతో జూనియర్లుగా ఉన్నవారితో కూడా పని చేస్తూ తరాల అంతరాలను పూడ్చేందుకు, దెబ్బతిన్న ఉద్యమాన్ని ఇతరులతో కలసి నిలబెట్టేందుకు, ఒకడుగు ముందుకు తీసుకుపోయేందుకు దోహదం చేశారు. ‘ఏరా బాబూ’ అంటూ భుజం మీద చేయి వేసి ఉద్యమంలోకి వచ్చిన యువకులతో కొరటాల మాదిరి మమేకం కావటం మరొకరి నుంచి ఊహించలేం. ఆయనతో పరిచయం ఉన్నవారెవరూ దీన్ని గురించి మర్చిపోలేరు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అమృతలూరు మండలంలోని ప్యాపర్రు గ్రామంలో 1926 సెప్టెంబరు 24న ఒక ధనిక రైతు కుటుంబంలో జన్మించారు. ఆ కుటుంబం, ఇతర సమీప బంధువులు కాంగ్రెస్‌, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారే. ఆ ప్రభావంతోనే పాఠశాలల్లో కొత్తగా ప్రవేశపెట్టిన డిటెన్షన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ తురిమెళ్ల హైస్కూలు విద్యార్థిగా పద్నాలుగేండ్ల ప్రాయంలోనే ఉద్యమకారుడిగా మారారు. పదకొండు రోజులు సమ్మె జరిగినా హెడ్‌మాస్టర్‌ దిగిరాకపోవటంతో అప్పటికే గుంటూరులో విద్యార్థి సంఘనేతగా ఉన్న మాకినేని బసవపున్నయ్యను కలిసి ఆందోళన తీవ్రతకు సంప్రదింపులు జరిపారు. దాంతో హెడ్‌మాస్టర్‌ డిటెన్షన్‌ విధానాన్ని తొలగించేందుకు అంగీకరించారు. దాని కొనసాగింపుగా గుంటూరు ఆంధ్రాక్రిస్టియన్‌(ఎసి కాలేజి) కాలేజీలో విద్యార్థి ఉద్యమంలో భాగస్వామిగా మారారు. మాకినేని, మోటూరు హనుమంతరావు, లావు బాలగంగాధరరావు తదితరులతో ఏర్పడిన పరిచయం కమ్యూనిస్టుగా మార్చింది. ఇంటర్‌తో చదువుకు స్వస్తి చెప్పి పార్టీ కార్యకర్తగా రేపల్లె ప్రాంత ఉద్యమంలోకి వచ్చారు. అప్పటి నుంచి మరణించేవరకు ఎర్రజెండా, కష్టజీవులను వదలకుండా నిలిచారు.
ప్రజాసమస్యలను అధ్యయనం చేయటంలో ప్రతి వామపక్ష, కమ్యూనిస్టు నేత ముందుంటారు. వారిలో కొరటాల ఒక ప్రత్యేకతను కనపరిచారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త సమస్యలు ముందుకు వస్తుంటాయి. వాటిని గ్రహిస్తేనే జనానికి దగ్గర అవుతారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పొగాకు పంట తరువాత ఆకర్షించిన పత్తి రైతులకు కాస్త ఆదాయం సమకూర్చటంతో పాటు అనేక మందిని ఆత్మహత్యలకు సైతం పురికొల్పింది. ఒకానొక సందర్భంలో అలాంటి ఆత్మహత్యలు తమ ప్రాంతంలో సాధారణమే అన్నట్లుగా కార్యకర్తలు చెప్పిన అంశాన్ని తీవ్రంగా పరిగణించి ప్రకాశం జిల్లాలో కారటాల అనేక గ్రామాలను సందర్శించారు. విపరీతమైన తెల్లదోమ, అది రెచ్చిపోయినతీరు, సింథటిక్‌ పైరిత్రాయిడ్స్‌ కలిగించిన పర్యావరణహాని, దాంతో రైతులు నష్టపడి అప్పులపాలు కావటానికి, బలవన్మారణాలకు సంబంధం ఉందన్న అంశాన్ని తొలిసారిగా మీడియా ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చిన ప్రత్యేకత కొరటాలదే. అంతే కాదు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తలెత్తిన తీవ్రకరవు పరిస్థితుల్లో గంజి కేంద్రాల ఏర్పాటు చొరవ కూడా ఆయనదే. దేశంలో తలెత్తిన అస్తిత్వ ఉద్యమాలు అనేక తరగతులను ఊపివేస్తున్న తరుణం. కమ్యూనిస్టులు వర్గ సమస్యలను తప్ప కులవివక్ష వంటి సామాజిక అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరనే విమర్శలు వెలువడ్డాయి. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు వచ్చిన ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ ఈ అంశాలను కొరటాలతో చర్చించారు. వాటిని తీవ్రంగా పరిశీలించిన సీపీఐ(ఎం) నాయకత్వం వేసిన ముందుడుగు కులవివక్ష వ్యతిరేక సంఘం రూపంలో ఉనికిలోకి వచ్చింది. అనేక గ్రామాల్లో అది జరిపిన పరిశీలనలో రెండు గ్లాసుల పద్ధతి, ఇతర తీవ్ర వివక్ష రూపాలు, తరువాత జస్టిస్‌ పున్నయ్య కమిటీ ఏర్పాటు, అది సమర్పించిన నివేదికలో కొనసాగుతున్న వివక్షను నిర్థారించిన తీరు తెలిసిందే. వర్గసమస్యల మీదనా లేక కుల అంశం మీద ముందుగా పోరాడాలా ఏది ముందు ఏది వెనుక, దేనికి ప్రాధాన్యత అనే తర్కం అవసరం లేదని, ఎక్కడ ఏ అంశం ముందుకు వస్తే దాని మీద, రెండు అంశాల మీద ఆందోళనలను కూడా జమిలిగా జరపాలనే అభిప్రాయం, తరువాత కొన్ని రాష్ట్రాలలో, జాతీయ సంఘ ఆవిర్భావం కూడా తెలిసిందే.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం గ్రోమోర్‌ ఫుడ్‌ అనే నినాదంతో ఎక్కడ సాగుభూమి ఉంటే అక్కడ పంటలు పండించాలని పిలుపునిచ్చింది. పూర్వపు గుంటూరు జిల్లాలోని రొంపేరు ప్రాంతంలో బంజరు భూములు కొన్ని పడావుగా ఉండగా మరికొంత అన్యాక్రాంతమైంది. ఈ భూములతో పాటు రేపల్లె ప్రాంతంలోని కృష్ణానది లంకల్లో తేలిన భూములను భూస్వాములు, జమిందార్లు ఆక్రమించుకున్నారు. వాటిని పేదలకు పంచాలని, చల్లపల్లి జమిందారుకు వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో ఇతర నేతలతో కొరటాల కూడా భాగస్వామిగా ఉన్నారు. రేపల్లె ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటం, కుల సంఘాల పేరుతో ఉన్న నేతలు వారి గురించి పట్టించుకోకపోవటం, ఆ తరగతికి చెందిన వారు కమ్యూనిస్టు అభిమానులుగా గణనీయంగా ఉండటంతో కొరటాల వారి సమస్యలను లోతుగా పరిశీలించారు. ఎంతగా అంటే అసెంబ్లీలో, వెలుపలా చేనేత గురించి కొరటాల చేసిన ప్రస్తావనలు, ఆందోళనలకు నాయకత్వం వహించిన తీరు గురించి వారంతా కొరటాల తమ సామాజిక తరగతికి చెందిన వారనే నమ్మేంతగా మమేకమయ్యారు. తరువాత చేనేత కార్మిక సంఘం ఏర్పాటు జరిగింది. అదే విధంగా రైతు, వ్యవసాయ కార్మిక సమస్యల మీద కూడా కొరటాలకు పట్టు ఉంది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి కొన్ని వందల ఓట్ల తేడాతో కొరటాల ఓడినా తరువాత కాలంలో కేంద్ర మంత్రిగా పని చేసిన కొత్త రఘురామయ్య తరువాత ఎన్నికలలో గుంటూరుకు మారేట్లుగా పోటీనిచ్చారు. తరువాత రెండుసార్లు ఎంఎల్‌ఏగా గెలిచారు.
మహత్తర తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా సరిహద్దులోని ఆంధ్ర ప్రాంత జిల్లాల్లో కమ్యూనిస్టులు అండగా నిలిచారు. ఆ కక్షతో నాటి కాంగ్రెస్‌ పాలకులు అనేక మందిని పట్టుకొని నిలువునా కాల్చిచంపారు, గ్రామాల మీద దాడులు చేశారు. అనేక మందిని జైలుపాలు చేశారు. అలాంటి వారిలో కొరటాల ఒకరు. 1948లో కడలూరు జైలుకు పంపారు. అక్కడి పరిస్థితుల మీద ఆందోళనకు దిగినపుడు దెబ్బతీన్న జీర్ణ వ్యవస్థ కొరటాలను జీవితాంతం బాధించింది.1975 ఎమర్జెన్సీ, అంతకు ముందు, నాలుగు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం గడిపారు. ప్రజాశక్తి సాహితీ సంస్థ సారధిగా, పత్రికలో తెచ్చిన మార్పులకు, అది తనకాళ్ల మీద తాను నిలిచే విధంగా ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు తీసుకున్న అన్ని చర్యలు, విస్తరణ వెనుక కొరటాల చోదకశక్తిగా ఉన్నారు. పత్రిక అందించే వార్తలు, విశ్లేషణల్లో రావాల్సిన మార్పులు, సూటిదనం గురించి నిరంతరం తపన పడేవారు. కార్యకర్తలు, వారి కుటుంబాల పరిస్థితుల గురించి పట్టించుకోవటంలో కూడా తనదైన ముద్ర వేశారు. ప్రజా ఉద్యమాలు, వాటికి తోడుగా మార్గదర్శిగా ఉండే పత్రికల నిర్వహణ గురించి కొరటాల వంటి వారు పడిన తపనను నేటి తరాలు అవగతం చేసుకొని వాటిని మరింతగా ముందుకు తీసుకుపోవటం, అంతిమ లక్ష్యమైన సమసమాజ దిశగా అడుగులు వేయటమే ఘనమైన నివాళి. కార్యకర్తలతో నేతల దగ్గరితనం అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించటాన్ని ప్రోత్సహిస్తుంది. కమ్యూనిస్టు పార్టీల్లో హౌదాలు అనేవి బాధ్యతలు తప్ప దర్పాన్ని ప్రదర్శించుకొనేందుకు కాదు. ఎంత మంది నేతలు, కార్యకర్తలు అలా ఉన్నారో కొరటాల వర్థంతి సందర్భంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అవసరమైతే పద్ధతులు మార్చుకోవాలి.
సెల్‌: 8331013288
ఎం. కోటేశ్వరరావు

Spread the love