పాలమూరుకు కృష్ణా జలాలు

Palamuru with Krishna Waters– పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభం
– గత పాలకుల వైఫల్యమే పాలమూరు వెనుకబాటు అని విమర్శ
– కృష్ణా వాటా తేల్చమని మోడీనడగాలని వ్యాఖ్య
– కొల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌కు వరాల జల్లు
తెలంగాణ సిద్ధించిన నాడు నా మనసు ఎంత పులకరించి పోయిందో.. ఈ రోజు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృస్ణా జలాలు పైకి ఉబికి వస్తుంటే అంతే పులకరించిపోయిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. సెప్టెంబర్‌ 16 సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని అన్నారు. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సీఎం కేసీఆర్‌ నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను కంప్యూటర్‌పై మీట నొక్కి ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలహారతి పట్టారు.
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
సింగోటం చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లా డుతూ… కాషాయ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్‌, అనంతరం కొల్లాపూర్‌, సింగోటం క్రాస్‌ రోడ్డు వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో మాట్లాడుతూ ‘బస్సులో వస్తున్న సమయంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు బీజేపీ జెండా పట్టుకొని బస్సుకు అడ్డం వచ్చారు, ఏం తప్పు చేశాను నేను. ఏం మోసం చేశాం. నేను ఒక్క మాట అడుగుతున్నా బీజేపీ బిడ్డలను. మీకు సిగ్గూ శరం, చీమునెత్తురు, పౌరుషం ఉంటే కృష్ణాలో వాటో తేల్చమని మోడీని అడగండి’ అంటూ విరుచుకుపడ్డారు. కష్ణానదిలో వాటాతేల్చమని ప్రధాని మోడీని కోరాం. విశ్వగురువు అని చెప్పుకునే ప్రధానికి మా అంత సిపాయిలు లేరనే బీజేపీకి వాటా తేల్చేందుకు పదేండ్లు అవుతుందా? కష్ణా ట్రిబ్యునల్‌కు రాష్ట్రాలకు నీళ్లు పంచమని లేఖ రాయించాలి. దానికి మోడీ కురుమనడు, కైమనడు’ అంటూ నిలదీశారు. ‘నీళ్లు వచ్చేది పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు. ఒక పక్కన బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ పోరాటం చేస్తే.. మీరు ఎవరి కోసం మౌనం పాటిస్తున్నారని బీజేపీ నేతలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ వచ్చాక రిజర్వాయర్లు ఎక్కడ కట్టాలని ఆలోచన చేశాం. గుట్టల మధ్య కట్టాలని నిర్ణయించాం. ఇవాళ పంపులు, రిజర్వాయర్లు పూర్తయ్యాయి. కాలువలు తవ్వాల్సి ఉంది. ఇంత పెద్ద పాలమూరుకు అడ్డం తగిలితే.. ఈ జిల్లాలో ఉన్న నాయకులే కేసులు వేస్తే.. పెండింగ్‌ పెట్టి.. దక్షిణ భాగంలో ఉన్న నెట్టెంపాడు, జురాల, బీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసుకున్నాం. పాలమూరు-రంగారెడ్డి ఎట్టకేలకు పూర్తి చేసుకున్నాం. భగవంతుడి దయతో విజయం సాధించాం. ఆంధ్రా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నీళ్లు మాకు అవసరం లేదు. మా వాటా మాకు చెబితే.. దాని ప్రకారం తీసుకొని బతుకుతం తప్పా.. మరొకటి కాదని చెప్పారు. ఆకలితో ఉన్నం. వలసలు పోయినోళ్లం. ఆగమైనోళ్లం.. ఇప్పుడిప్పుడే మొఖాలు తెల్లబడుతున్నరు. రైతుబంధు, బీమా పెట్టుకున్నాం. 24 గంటల ఉచిత కరెంటు పెట్టుకున్నామని’ సీఎం కేసీఆర్‌ అన్నారు.
ఆర్డీఎస్‌ను ఆంధ్రా పాలకులే నాశనం చేశారు
తెలంగాణ సరిహద్దులో ఉన్న ఆర్డీఎస్‌ను కూడా ఆంధ్రా పాలకులే నాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. ‘ప్రాజెక్టులు ఎలా కడుతావు.. పాలమూరు పైన ఉన్నది కదా? అని నాటి నాయకులు ప్రశ్నించారు. నీళ్లు కిందకు లేవు వెదవా.. మీ మెదడు మోకాళ్లలో ఉందని చెప్పాను. ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. పాలమూరు లిఫ్ట్‌ పొంగును చూస్తుంటే.. కష్ణమ్మ తాండవం చేసినట్టు ఉంటుంది. నా ఒళ్లంతా పులకరించి పోయింది. నా జీవితం ధన్యమైంది. ఒకటే పంపు వాగు పారిన రీతిలో ఉంది. కాల్వలు కంప్లీట్‌ కావాలి. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి. నల్లగొండలోని డిండి, మునుగోడుకు నీళ్లు ఇవ్వాలి’ అని కేసీఆర్‌ అన్నారు.
సువర్ణాక్షరాలతో…
మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇవాళ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.’ఒకప్పుడు పాలమూరు బిడ్డ హైదరాబాద్‌లో అడ్డా కూలీ. కానీ ఇవాళ పాలమూరుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. స్థానికులు ఇక్కడే తమ పొలాల్లో పనిచేసుకుంటున్న వ్యవసాయధారులని’ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పర్యటించినప్పుడు.. మీకు మాటిచ్చాను. రాష్ట్రం వస్తేనే సకల దరిద్రాలు మాయమవుతాయని చెప్పాను. మన హక్కులు, నీళ్లు వస్తాయని అన్నాను. కష్టపడి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. పాలమూరు ఎంపీగానే తెలంగాణ సాధించాను. ఇది ఒక చరిత్ర. ఈ జిల్లా కిర్తికీరిటంలో శాశ్వతంగా ఉంటుంది. మొత్తం తెలంగాణలో అంచనాలు వేసుకుని, మనకు రావాల్సిన వాటాలు లెక్కలు కట్టుకుని కాళేశ్వరం, సీతారామ, పాలమూరు చేపట్టాం.. ఇవి పూర్తయితే తెలంగాణ వజ్రం తునకలా తయారై దేశానికే అన్నం పెడుతాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. సీతారామ పనులు చకచక జరుగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల కూడా మూడు నాలుగేండ్ల కిందనే పూర్తయ్యేదన్నారు. 1975లో బచావత్‌ తీర్పు ఇచ్చే సమయంలో మహబూబ్‌నగర్‌ నీళ్లు ఏవని నాటి పాలమూరు పాలకులు అడగలేదని కేసీఆర్‌ గుర్తు చేశారు.
70 ఏండ్లు ఏడ్చింది…
’70 ఏండ్లు ఏడ్చినా పాలమూరును పట్టించుకోలేదే. తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? ఇదే కాంగ్రెస్‌ కాదా? తెలంగాణను ఉద్దరిస్తా.. నేను దత్తత తీసుకున్నానని చెప్పి.. పునాది రాళ్లు పాతింది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు కాదా? ఎవరైనా సహాయం చేశారా? మనం ఏడ్చిన నాడు.. వలసపోయినాడు.. జిల్లా మొత్తం బొంబాయి బతుకులకు ఆలవాలమైన నాడు.. ఆగమాగమైననాడు ఎవరైనా పట్టించుకున్నారా ? మనం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకొని ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నామని’ వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 50 ఏండ్ల కాంగ్రెస్‌, 16 ఏండ్ల తెలుగుదేశం పాలనలో మహబూబ్‌నగర్‌కు మెడికల్‌ కాలేజీ ఇచ్చారా? ఇవాళ ఎన్ని మెడికల్‌ కాలేజీలు ఉన్నరు ? ఐదు మెడికల్‌ కాలేజీలు ఉన్నరు.
నిన్ననే తొమ్మిది కాలేజీలను ప్రారంభించాం. తెలంగాణ ఈ రోజు సంవత్సరానికి 10వేల మందిని ఉత్పత్తి చేసే మేధోరాష్ట్రంగా ఎదిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ లేదు. మామూలు స్కూల్‌ ఫీజంతా చెల్లిస్తే ఎంబీబీఎస్‌ చదువుకునే పరిస్థితి బిడ్డలకు తీసుకువచ్చాం. పేదింటి పిల్లల కోసం బడుల్లో అల్పహారం అందిస్తున్నాం. తమిళనాడులో అధ్యయనం చేయించి.. టిఫిన్‌, మధ్యాహ్న భోజనం బ్రహ్మాండంగా ఇవ్వాలని జీవో జారీ చేశాం. వైద్య, విద్య, పవర్‌ రంగంలో ఒక్కో మొట్టు ఎక్కుతూ ముందుకెళ్తున్నామన్నారు.
కొల్లాపూర్‌కు వరాల జల్లు
కొల్లాపూర్‌ పట్టణానికి మంజూరు చేసిన ప్రత్యేక ఫండ్‌తో బ్రహ్మాండంగా మిగిలిన పనులన్నీ చేయాలని కోరుతున్నానని కేసీఆర్‌ తెలిపారు. కొల్లాపూర్‌కు ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీని కూడా మంజూరు చేస్తాన్నారు. రెండు, మూడు లిఫ్ట్‌లు అడిగారు. జిల్‌దార్‌ తిప్ప లిఫ్ట్‌, బాచారం హై లెవల్‌ కెనాల్‌, పసుపుల బ్రాంచ్‌ కెనాల్‌ వైడనింగ్‌, లైనింగ్‌, మల్లేశ్వరం మినీ లిప్ట్‌ కావాలని అడిగారు. అధికారుల చేత సర్వే చేయించి తప్పకుండా మంజూరు చేస్తానన్నారు. రూ. 10 కోట్లతో బోడగట్టు చెక్‌ డ్యామ్‌కు ఆదివారమే జీవో ఇస్తామన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ. 15 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో కూడా జేఎన్‌టీయూ ద్వారా ఇంజినీరింగ్‌ కాలేజీ మంజూరు చేస్తామంటూ వరాల జల్లు కురిపించారు. ఇప్పటికే ఆదేశాలిచ్చామని వివరించారు. ఆ రకంగా నన్ను ఎంపీగా చేసి, తెలంగాణ సాధించేంత యోధుడిగా నన్ను తయారు చేసినందుకు దన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ బహిరంగసభకు కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి అధ్యక్షత వహించగా మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పి. సబితాఇంద్రారెడ్డి, డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి. మురళీధర్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో అక్రమ అరెస్టులు
పెంట్లవెల్లి పట్టణంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి.ఈశ్వర్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు, రమాదేవి, సువర్ణ, గోవిందమ్మ, పద్మ, వెంకటమ్మ, నాగమణి, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ సుకన్య, శారద, జ్యోతి, ప్రసన్నను అరెస్టు చేశారు. సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎం.శ్రీనివాసులు, కొల్లాపూర్‌ మండల కార్యదర్శి బి.శివ వర్మ, పెద్దకొత్తపల్లి మండల కార్యదర్శి దశరథ నాయక్‌, సీపీఐ(ఎం) కొల్లాపూర్‌ టౌన్‌ కార్యదర్శి ఎండి సలీం, ఆశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీదేవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్‌ను అర్ధరాత్రి అరెస్టు చేసి కొల్లాపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రంగినేని జగదీశ్వరుడు, మేకల రాము యాదవ్‌ పలువురిని అరెస్టు చేశారు. కోడేరు మండల పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. వంగూరులో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బండపల్లి బాలస్వామి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, ఏపీ మల్లయ్య, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఇండ్లల్లో నిద్రిస్తుండగా లేపి లేపి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మద్దెల రామదాసును శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొల్లాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Spread the love