నీట్‌ అవకతవకలపై విచారణ జరిపించాలి : కేటీఆర్‌

నీట్‌ అవకతవకలపై విచారణ జరిపించాలి : కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ద్వారా విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం ట్విట్టర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్‌ ఎగ్జామ్‌కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే అవకతవకలు జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు.ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది నీట్‌ పరీక్షలో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించటం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. నీట్‌లో ఉన్న మార్కింగ్‌ విధానం ప్రకారం 718, 719 మార్కులు రావటమన్నది సాధ్యమయ్యే పనికాదని పేర్కొన్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ‘గ్రేస్‌ మార్కులు’ ఇచ్చామని చెబుతున్నారనీ, కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్‌ మార్కులు ఇచ్చినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. ఆయా మార్కుల కోసం ఏ విధానాన్ని అవలంబించారన్నది చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపారు. నీట్‌ ఫలితాలను ప్రిపోన్‌ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోందని పేర్కొన్నారు.

Spread the love