నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 8 ఏండ్లలో 731 గురుకుల పాఠశాలలు, కాలేజీలను ఏర్పాటు చేశామని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురుకులాల నిర్వహణకు రూ. 13,528 కోట్ల 6 లక్షలు ఖర్చు చేశామన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గురుకుల పాఠశాలల నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. గురుకుల విద్యాసంస్థలు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణంగా నిలిచాయనడంలో సందేహాం లేదు అని ఈశ్వర్ తెలిపారు. ఏ ప్రాంతమైతే విద్యావ్యవస్థలో ఉన్నతంగా ముందుకెళ్తుందో.. ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని సీఎం కేసీఆర్ నమ్మారు. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గురుకులాలు స్థాపించారు. విద్యకు దూరంగా ఉన్న వీరందరికి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. రాష్ట్రంలో గురుకులాలకు ప్రాధాన్యత పెరిగింది.
గత ప్రభుత్వాలు గురుకులాలు స్థాపించినప్పటికీ, వాటిని అభివృద్ధి చేయలేదు. పట్టించుకోలేదు. అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకులాలకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. 731 గురుకులాలను ప్రారంభించి, సకల సౌకర్యాలు కల్పించారు. పాతవి, కొత్తవి కలిపితే 1022 గురుకుల పాఠశాలలు అద్భుతంగా నిర్వహిస్తున్నాం. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని గురుకులాలను ప్రతి సంవత్సరం అప్‌గ్రేడ్ చేస్తున్నాం. డిగ్రీ స్థాయిలో గురుకులాలను స్థాపించామని గుర్తు చేశారు. ప్రత్యేక కోర్సులను డిగ్రీ కాలేజీల ద్వారా అందిస్తున్నాం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. గురుకుల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నామని తెలిపారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించి, మంచి జీవితాన్ని గడుపుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు.