17న కొడకండ్లకు కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
– మినీ టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన
– ఆగస్టు నుంచి వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కులో ఉద్యోగావకాశాలు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో మినీ టెక్స్‌టైల్‌ పార్కుకు ఈనెల 17న ఐటీ, పరిశ్రమలు, చేనేత, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేస్తారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్ల, చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే సిరిసిల్ల తరహాలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించామన్నారు. ఇది ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో కుట్టుశిక్షణ పూర్తి చేసుకున్న పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మహిళలకు ఆగస్టు నుంచి వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కులో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు చెందిన పలువురు ప్రతినిధులతో ఈ అంశంపై చర్చించామన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో మూడు వేల మంది మహిళలకు దుస్తులు కుట్టడంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉచితంగా కుట్టు మిషన్లను కూడా పంపిణీ చేశామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టెక్స్‌టైల్‌ కమిషనర్‌ బుద్ధ ప్రకాష్‌, డైరెక్టర్‌ మెహర్‌, యంగ్‌ ఇండియా, కిటెక్స్‌, తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love