అమిత్‌ షా జోక్యం చేసుకోవాలి

– మణిపూర్‌ను పరిరక్షించాలి :మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా జోక్యం చేసుకుని మణిపూర్‌ను పరిరక్షించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు డిమాండ్‌ చేశారు. ఆ రాష్ట్రంలో కుకీ మహిళల పట్ల సంఘవిద్రోహ శక్తులు భయానక హింసకు పాల్పడటం పట్ల ఆయన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశారు. అక్కడి పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయనీ, వెంటనే వాటిని చక్కదిద్దేందుకు కార్యాచరణ చేపట్టాలని కోరారు.’ తాలిబన్లు…. మహిళలు, చిన్నారుల పట్ల అగౌరవంగా వ్యవహరించినప్పుడు భారతీయులుగా ఆ చర్యలను వ్యతిరేకించాం. మన సొంత దేశంలో మొయితీ సంఘవిద్రోహ శక్తులు కుకీ మహిళలను నగంగా ఊరేగిస్తూ, లైంగికంగా వేధిస్తున్న అనాగరిక చర్య సాధారణ ఘటనగా ఇక్కడ కనిపిస్తున్నది. మణిపూర్‌లో భయంకరమైన హింస, శాంతి, భద్రతలు పూర్తిగా క్షీణించిన పరిస్థితి పట్ల కేంద్ర ప్రభుత్వం మౌనం వహించింది. ఆ రాష్ట్రంలో ప్రతిదీ ధ్వంసమవుతుంటే ప్రధాని మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా ఎక్కడున్నారు?. మణిపూర్‌ను రక్షించేందుకు మీ పూర్తి సమయాన్నీ, శక్తిని వెచ్చించాలి…..’ అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.
మణిపూర్‌లో నెలకొన్న తీవ్రమైన అత్యవసర పరిస్థితిని వెంటనే చక్కదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. నాగరిక సమాజంలో ఎంత మాత్రం సహించలేని విధంగా కుకీ మహిళల పట్ల దాడులు, వారి గౌరవానికి భంగం కలిగించే ఘటనలను వెంటనే నిలువరించాలని సూచించారు. మణిపూర్‌లో శాంతి, భద్రతల పునరుద్ధరణకు ప్రాధాన్యతనివ్వాలని కేటీఆర్‌ కోరారు. కేంద్ర ప్రభుత్వ మౌనం ప్రభావిత సామాజిక వర్గం, పౌరుల నిస్పృహకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యత గల భారతీయ పౌరులుగా, హింసకు వ్యతిరేకంగా బాధితుల మతం, సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరి భద్రత, గౌరవాన్ని కాపాడటం అందరి సమిష్టి బాధ్యత అని గుర్తుచేశారు. మణిపూర్‌ను కాపాడేందుకు, అక్కడి ప్రజలకు న్యాయం, భద్రత కల్పించేందుకు ఉన్నతస్థాయి అధికార యంత్రాంగ జోక్యం తక్షణావసరమని కేటీఆర్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

Spread the love