Monday, July 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మికపక్షపాతి పీవీ రావు

కార్మికపక్షపాతి పీవీ రావు

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలోని మెయిన్ మీటింగ్ హాల్‌‌కు ఆయన పేరు పెడతాం : స్మారక సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య
సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు

నవతెలంగాణ-సిటీబ్యూరో
సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, కార్మికుల పక్షపాతి పసుపులేటి వెంకటేశ్వరరావు (పీవీ రావు) అని సీపీఐ(ఎం) పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌ కొండాపూర్‌‌లోని శుభం గ్రాండ్‌ ‌హోటల్‌‌లో పీవీ రావు స్మారక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ సీఐటీయూ ఉద్యమంలో, పార్టీ నిర్మాణంలో పీవీ రావు కీలక పాత్ర పోషించారన్నారు. ప్రింటింగ్ ప్రెస్ యూనియన్ స్థాపించి అక్కడి కార్మికుల హక్కుల కోసం నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. సమాజంలో అనేక అసమానతలు కొనసాగుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా నేడు పోరాడమే మన ముందున్న మార్గమన్నారు. వాళ్ల కుటుంబాన్నంతా పార్టీకి అనుబంధంగా చేయడంలో కీలకపాత్ర పోషించారన్నారు. కుటుంబం అంటే పార్టీ.. పార్టీ అంటే కుటుంబం.. అనే పద్ధతిలో కుటుంబాన్ని తీర్చిదిద్దడం అందరికీ సాధ్యం కాదన్నారు. తన ముగ్గురు కూతుర్లను ఉత్తములుగా తీర్చిదిద్దారని తెలిపారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సమిష్టి నాయకత్వాన్ని అభివృద్ధి చేయడంలో కృషి చేశారనీ, నివాస ప్రాంతాల్లో ట్రేడ్ యూనియన్‌‌తోపాటు పార్టీ, ప్రజా సంఘాలను నిర్మించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్‌‌లో మహిళ, విద్యార్థి, యువజన సంఘాల నిర్మాణానికి కృషి చేశారన్నారు.

పార్టీ పూర్తి కాలం కార్యకర్తల పట్ల ఆయనకు అపారమైన ప్రేమ అభిమానాలు ఉండేవన్నారు. మహిళా కార్యకర్తలను ఉద్యమంలోకి తీసుకువచ్చి వారిని ప్రోత్సహించేవారన్నారు. సమాజంలో నేడు కొనసాగుతున్న మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడమే పీవీ రావుకు నిజమైన నివాళి అని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలోని మెయిన్ మీటింగ్ హాల్‌కు పీవీ రావు పేరు పెడతామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ.. పీవీ రావు కుటుంబం, తమ కుటుంబం కలిసిమెలిసి ఉన్నామని, వారి ప్రభావం మాపైన ఎంతో ఉన్నదన్నారు. మరణానంతరం తన శరీరాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం దానం చేయాలని పీవీ రావు నిర్ణయించుకోవడం ఆయనకున్న శాస్త్రీయ భావజాలానికి నిదర్శనమని కొనియాడారు. సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రెస్ వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని పీవీ రావు తనపై ఒత్తిడి తెచ్చేవారని గుర్తుచేసుకున్నారు. సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే వరకు వదిలి పెట్టేది లేదనే వారన్నారు. కార్మికులకు ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ ఆయన నిలబడేవారన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కంకణ బద్దులు కావాలని కోరారు. ​

జ్ఞాపకాలతో పుస్తకం తీసుకువస్తాం : ‌
కూతురు జనీల, అల్లుడు ఆశోక్‌‌కుమార్‌
మా నాన్న లేకపోయినా మాకు పెద్ద కుటుంబాన్ని అప్పగించారని పీవీ రావు కుమార్తె జనీల, అల్లుడు అశోక్ కుమార్ అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం నాన్న పనిచేస్తూనే తమ కుటుంబ సభ్యులను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారన్నారు. మా నాన్న తమ కుటుంబంలో శాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. నాన్న జ్ఞాపకాలను నేటి తరానికి అందించేందుకు ఒక పుస్తకాన్ని తీసుకురానున్నట్టు తెలిపారు. పీవీ రావుతో ఉన్న అనుబంధాలు, జ్ఞాపకాలను రాసి ఇవ్వాలని వారు కోరారు. వెంకటేశ్వరరావు కుమార్తె విమల, అల్లుడు (సీపీఐ(ఎం) పార్టీ నాయకులు) కృపేందర్‌ అమెరికా నుంచి ఆడియో సందేశం పంపారు. అనంతరం పీవీ రావు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు డీజీ నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య, మేడ్చల్‌‌, హైదరాబాద్‌ జిల్లాల కార్యదర్శులు సత్యం, ఎం. వెంకటేష్, ప్రెస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి, ప్రభుదేవా ఆర్ట్స్ అకాడమీ ఇన్‌చార్జి జగ్గరాజు, శ్రామిక మహిళా నాయకులు విజయవాణి, నాయకులు శోభన్, ఆర్. వెంకటేష్, మహేందర్, శ్రవణ్ కుమార్, ఎంసీపీఐ నాయకులు వెంకట్‌ ‌రెడ్డి, ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్‌ ‌పాలకూరి లక్ష్మి, బాడీ డోనర్స్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షులు గంజి ఈశ్వర లింగం, పీవీ రావు కూతుర్లు, అల్లుళ్లు.. సుజాత, వెంకటేశ్వర రావు, రమా దేవీ, రాఘవయ్య, సుశీల, ఇతర కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా కార్యకర్తల పట్ల ప్రత్యేక శ్రద్ధ : జ్యోతి
మహిళా కార్యకర్తల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారంపై పీవీ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పార్టీ, ప్రజాసంఘాల బాగోగుల గురించి నిరంతరం ఆరా తీసేవారని అన్నారు. వారితో కలిసి హైదరాబాద్‌ ఉద్యమంలో పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. వారు కోరుకున్న లక్ష్యాలను సాధించేందుకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -