రైతులకు చేరువయ్యేలా భూ పరిపాలనలో మార్పు తేవాలి

Land administration should be changed to reach farmers– కొత్త మండలాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
– తహశీల్దార్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం :రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతులకు మరింతగా చేరువయ్యేందుకు భూ పరిపాలనలో సమగ్రమైన మార్పులు తేవాలని తెలంగాణ తహశీల్దార్స్‌ అసోసియేషన్‌(టీజీటీఏ) నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని టీజీటీఏ కార్యాలయంలో సోమవారం ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరణి, భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ పూర్వ వీఆర్‌ఏ, వీఆర్‌ఓల న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులను చిన్నాభిన్నం చేసిన జీఓ నం.317ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానానికి స్వస్తి పలికి పాత పెన్షన్‌ విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దూర ప్రాంతాలకు బదిలీ అయిన తహశీల్దార్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇబ్బందులు పడుతున్నారనీ, వీరిని పూర్వ స్థానాలకు బదిలీ చేయాలని కోరారు. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న అర్హులైన తహశీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అద్దె వాహనాల ఛార్జీలను పెంచడంతో పాటు పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలనీ, కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మంత్రికి విన్నవించారు. రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. భూవివాదాల సత్వర పరిష్కారం కోసం రెవెన్యూ కోర్టులు, అప్పిలేట్‌ అథారిటీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రాములు, ప్రధాన కార్యదర్శులు రమేష్‌ పాక, అరేటి రాజేశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఫూల్‌ సింగ్‌ చౌహాన్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు పి.రాధ, కోశాధికారి శ్రీనివాస్‌ శంకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love