నవతెలంగాణ-మద్నూర్
ప్రత్యేక తెలంగాణ ఏర్పడి నాటి నుండి నేటి వరకు మండల పరిధిలోని సోమూరు గ్రామ శివారులో ఉన్న సుమారు 756 భూములు భూభారతి సర్వేకు నోచుకోలేదు. ఏండ్ల తరబడి స్తానిక రైతాంగం, ప్రజలు భూముల రిజిస్ట్రేషన్ ల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా పంట పెట్టుబడి సాయం కింద భుములు ఉన్న రైతాంగానికి రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాలలో నగదు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. గత పదిహేనేండ్లుగా సోమూరు గ్రామ శివారు రైతాంగం ప్రభుత్వ టీఫన్ నక్ష ప్రకారం భూములు సర్వే కానందున రైతుబంధు పథకానికి అర్హులు కాకుండాపోయింది.
ఎట్టకేలకు సోమవారం ఈ గ్రామాల రీ సర్వేకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సర్వే అధికారులు కూడా గ్రామ శివారు భూములను పరిశీలించారు. గ్రామ సర్పంచ్ సంగం పటేల్ ఆధ్వర్యంలో భూభారతి సర్వే పనులను తాజాగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడూతూ.. సర్కార్ నక్ష ప్రకారం మా భూములు సర్వే చేపట్టడం ఎంతో ఆనందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో భూభారతి సర్వే అధికారులు, సర్వేయర్ వెంకట్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.



