దేశంలో మతతత్వ, ఫాసిస్టు శక్తుల ఎజెండా వెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్
కార్పొరేట్ సంస్థల వ్యతిరేక పోరాటాలను నీరుగార్చే కుట్ర : అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలే
జలంధర్ : దేశంలో మతతత్వ, ఫాసిస్టు శక్తుల ఎజెండాను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ వేగంగా ముందుకు తీసుకువెళ్తోందని అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలే అన్నారు. మతతత్వం, ఫాసిజం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, కూలీలు, ఇతర వర్గాలు చేస్తున్న తీవ్ర పోరాటాలను బలహీన పరిచేందుకు ఈ శక్తులు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. ఈ శక్తులను ఎదుర్కోవాలంటే దేశంలోని వామపక్ష, ప్రగతిశీల, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకం కావడం అత్యంత అవసరమని ఆయన నొక్కి చెప్పారు. జలంధర్‌లోని దేశ్ భగత్ యాద్గార్ హాల్‌లో అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా శనివారం భారీ ర్యాలీ నిర్వహించాయి. అంతకు ముందు అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలే, పంజాబ్ సీనియర్ ఉపాధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సెఖోన్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్, ఇతర నాయకులతో కలిసి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, షహీద్ భగత్ సింగ్ సహచరుడైన కామ్రేడ్ కిషోరీ లాల్ విగ్రహానికి పూలమాల వేసి విప్లవాత్మక నివాళులర్పించారు.



