విలక్షణ నటుడు విజయకాంత్‌ ఇకలేరు

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత విజయకాంత్‌ ఇకలేరు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయనకు బుధవారం నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని మియాట్‌ ఇంటర్నేషనల్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. చికిత్స పొందుతూ ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’గా పేరొందిన తమ అభిమాన నటుడు విజయకాంత్‌ ఇకలేరనే విషయాన్ని తెలుసుకుని అభిమానులు కంటతడిపెంటుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు సైతం విజయకాంత్‌తో తమకి ఉన్న అనుబంధాన్ని సోషల్‌ మీడియా వేదికగా గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా ప్రజా నాయకుడిగా ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న విజయకాంత్‌ జీవిత విశేషాలు..
విజయకాంత్‌ 1952 ఆగస్టు 25న మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. ఆయన నటించిన తొలి సినిమా ‘ఇనిక్కుమ్‌ ఇలమై’ (1979). ఈ సినిమాతో ఆయన ప్రతి నాయకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
ఎస్‌.ఎ. చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’ చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొంది విజయకాంత్‌కు మంచి విజయాలను అందించాయి. ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ సినిమా అన్ని భాషల్లోనూ విజయం సాధించింది.
1979 నుంచి 2015వరకు ఆయన దాదాపు 150కి పైనే సినిమాల్లో నటించారు. 18 సినిమాలు కేవలం ఒకే ఏడాది(1984)లో రావడం ఓ విశేషమైతే, పోలీస్‌ అధికారిగా ఇరవైకి పైగా చిత్రాల్లో మెప్పించడం మరో విశేషం. ఆయన నటించిన ఆఖరి సినిమా ‘సగప్తం’ (2015). ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
విజయకాంత్‌ సినిమా అంటే కచ్చితంగా సందేశం ఉంటుంది. స్టార్‌ హీరో అయినప్పటికీ తన నిర్మాతలు ఆర్థికంగా నష్టాల్లో ఉంటే పారితోషికం తీసుకోకపోవడం విజయకాంత్‌ ప్రత్యేకత. ‘విప్లవకళాకారుడు’, ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజయకాంత్‌ తన కెరీర్‌లో దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ‘విరుధగిరి’. తన బావ సుధీత్‌తో కలిసి ‘పల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ వంటి చిత్రాలను నిర్మించారు. ‘సగప్తం’ చిత్రంలో విజయ కాంత్‌తోపాటు ఆయన తనయుడు కూడా నటించారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.

Spread the love