మన నల్గొండను మనమే అభివృద్ధి చేసుకుందాం

– నల్గొండ పట్టణంతోపాటు, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా
-18 కోట్లతో సీసీ రోడ్లు.. 20 కోట్లతో నీలగిరి నిలయం.. 260 కోట్లతో చుట్టూ రోడ్ల నిర్మాణం
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ఉన్న నల్గొండను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ  శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం నల్గొండ మున్సిపల్ సమావేశ మందిరంలో  నిర్వహించిన నల్గొండ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నల్గొండ జిల్లాను  అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. నల్గొండ హైదరాబాద్ కు దగ్గరగా ఉండటం, ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉండడం, టూరిజం ఇతర అన్ని రంగాలలో అవకాశాలు ఉన్నందున జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. నూతనంగా ఏర్పాటు అయిన రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగా నల్గొండ పట్టణంలో 18 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని, 20 కోట్ల రూపాయలతో నీలగిరి నిలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. 260 కోట్ల రూపాయలతో పట్టణం చుట్టుపక్కల రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. సంవత్సరంలోపు పట్టణం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో సహా రోడ్లు ప్రతి వార్డులో సిసి రోడ్లతో పాటు, ప్రతి ఇంటికి  తాగు నీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇందుకు గాను అందరూ సహకరించాలని కోరారు. గ్రామకంఠం, ప్రభుత్వ భూములలో ఇండ్లు  నిర్మించుకుని ఇంటి నంబర్లు లేని  వాటిని గుర్తించి వారికి ఇంటి నెంబర్ తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేందుకుగాను చర్యలు తీసుకుంటామని, ఇందుకు  వెంటనే బృందాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల రోడ్డుకు టెండర్లు పిలువనున్నామని, 20 కోట్ల రూపాయలతో కలెక్టరేట్ ఎదురుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తున్నామని, పట్టణాన్ని అందరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులను స్వీకరిస్తామని, ప్రతి  నియోజకవర్గంలోఇంటిగ్రేటెడ్ హాస్టల్లను కట్టనున్నామని, కొడంగల్, మధిర, నల్గొండలలో మొదటి విడతలన వీటిని చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని గేటెడ్ కమ్యూనిటీలతో సహా, పాత కాలనీలలో సైతం సీసీ రోడ్లు వేస్తామని ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో గ్రామకంఠం, ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న వారికి సర్వహక్కులు కల్పించి ఇళ్లపై లోన్లు  వచ్చేలాగా అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్గొండ అన్ని మున్సిపాలిటీలలో ఇలాంటి వాటిపై అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామని, నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తానని తెలిపారు.
కౌన్సిలర్లు మాట్లాడుతూ..
పలువురు  కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో కొన్ని వార్డులలో మురికికాలువల  సమస్య ఉందని, అదేవిధంగా రోడ్ల సమస్య ఉందని, ఉదయ సముద్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, పానగల్, ఛాయా సోమేశ్వర దేవాలయం, పచ్చల సోమేశ్వరాలయాన్ని పర్యాటకంగా ఏర్పాటు చేయాలని, పట్టణాన్ని కలిపే నాలుగు రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, పలు సూచనలు చేశారు .ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని, రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్ వంటి వాటిని అన్ని కాలనీలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాద్ అహ్మద్,ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ  వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love