పర్సా పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం

Let's continue the fighting spirit of Parsa– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– కార్మిక పోరాటాలకు పర్సా మార్గదర్శి : ఎం.సాయిబాబు
– జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి: పోతినేని
– బీజేపీని ఓడిస్తాం : బి.వెంకట్‌
– ఘనంగా ప్రారంభమైన పర్సా సత్యనారాయణ శత జయంతి ముగింపు ఉత్సవాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
అమరజీవి పర్సా సత్యనారాయణ గొప్ప పోరాట యోధుడని, ఆయన పోరాట స్ఫూర్తిని సీఐటీయూ రాష్ట్ర కమిటీ కొనసాగిస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పర్సా శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో ప్రారంభించారు. తొలుత సీఐటీయూ జెండాను సంఘం సీనియర్‌ నాయకులు పి.రాజారావు ఆవిష్కరించారు. పర్సా సత్యనారాయణ జీవిత విశేషాలు తెలిపే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ను సీనియర్‌ నాయకులు ఎంఎన్‌.రెడ్డి ప్రారంభించారు. శానన సభ్యుడుగా ఉన్న నాటి ఫొటోలు, చివరి అంకంలో ఆయన పాల్గొన్న పలు కార్యక్రమాలతో పాటు ఆయన మరణాంతరం కొత్తగూడెంలో జరిగిన అంతిమ యాత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ అందరిని ఆకట్టుకుంది. అనంతరం పర్సా శత జయంతి ఉత్సవాల వేదిక వద్ద ఏర్పాటు చేసిన పోరాట యోధులు, అమరజీవులు పర్సా సత్యనారాయణ, అనంత రెడ్డి, శేషగిరిరావు, జార్జి, మంచికంటి రామకిషన్‌రావు, ఏలూరి లక్ష్మీనారాయణ, కంగాల బుచ్చయ్య, కెఎల్‌.లక్ష్మీనర్సింహారావు చిత్ర పటాలకు అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మాచారి అధ్యక్షతన జరిగిన సభలో చుక్క రాములు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కార్మిక నిర్మాతల్లో పర్సా సత్యనారాయణ ముఖ్యులని తెలిపారు. కార్మిక ఉద్యమంలో పనిచేసే ప్రతి కార్యకర్తా పర్సా జీవితాన్ని అధ్యయనం చేయాలని కోరారు. నేడు కార్మిక ఉద్యమం ఎదుర్కొంటున్న లేబర్‌ కోడ్‌లు, ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయటమే పర్సాకి మనమిచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. గని కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించిన పర్సా.. పోరాట పటిమతో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. సీఐటీయూ అభివృద్ధి, ఐక్య ఉద్యమాలకు ఆయన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. పర్సా శత జయంతి ముగింపు ఉత్సవాలు కార్మికోద్యం ప్రారంభించిన సింగరేణి గని ప్రాంతం కొత్తగూడెంలో నిర్వహించడం అభినందనీయమన్నారు.
నమ్మిన ఆశయమే పర్సా ఆస్తి : మంతెన సీతారాం
పర్సాకి ఉన్న ఏకైక ఆస్తి తాను నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతం మాత్రమేనని సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, పర్సా సత్య నారాయణ అల్లుడు మంతెన సీతారాం అన్నారు. ప్రజా ప్రతినిధిగా, కార్మిక నాయకునిగా సుదీర్ఘ కాలం పని చేశారన్నారు. ఏనాడూ డబ్బు కోసం, ఆస్తి కోసం ఆలోచన చేయలేదని తెలిపారు. జీవితంలో కటిక పేదరికం, దారిద్య్రాన్ని అనుభవించినా.. నిర్బంధాన్ని, జైలు జీవితాన్ని అనుభవించినా.. ఎక్కడా అవినీతికి, అవకాశవాదానికి చోటు ఇవ్వలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌ సైతం పార్టీ అకౌంట్‌కి జమ చేసి తన క్రమశిక్షణను నిరూపించుకున్నారని కొనియాడారు. ప్రజల కోసం.. కార్మిక వర్గ రాజ్యం కోసం.. పోరాడే ప్రతి కార్మిక నాయకుడు, కమ్యూనిస్టు కార్యకర్తకు పర్సా జీవితం మార్గదర్శిగా ఉంటుందని అన్నారు.
పోరాటాలకు మార్గదర్శి పర్సా: ఎం.సాయిబాబు
కార్మిక పోరాటాలకు పర్సా మార్గదర్శి అని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. నిజాం సర్కార్‌ కాలంలో కార్మిక సంఘాన్ని నిర్మించి.. వందలాది మంది కార్యకర్తలకు ఉద్యమ గురువుగా పనిచేశారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో సీఐటీయూకి 32 ఏండ్ల పాటు అధ్యక్షులుగా పనిచేశారని గుర్తుచేశారు. పాల్వంచ ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో విశాఖ ఉక్కు. ఆంధ్ర హక్కు ఉద్యమం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన గొప్ప ఉద్యమయోధుడన్నారు.
కార్యకర్తల తయారీకి పెద్దపీట వేశారు : పి.రాజారావు
పర్సా సత్యనారాయణ కార్యకర్తల తయారీకి పెద్దపీట వేశారని సీఐటీయూ సీనియర్‌ నేత పి.రాజారావు గుర్తుచేశారు. వ్యక్తిగత శ్రద్ధతో కార్యకర్తలకు రాజకీయ క్లాసులు బోధించేవారని, రాజకీయ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి క్యాడర్‌ని అభివృద్ధి చేశారని తెలిపారు.
త్యాగశీలి పర్సా పోతినేని సుదర్శన్‌
పర్సా త్యాగశీలిని, ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుని వారి యోగక్షేమాలు, వారి ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలను ఉత్తరం ద్వారా తెలుసుకునే అలవాటు ఉన్న మహౌన్నత వ్యక్తి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ గుర్తుచేశారు. తన జీవితమే ఉద్యమంగా.. ఉద్యమం కోసం జీవితాన్ని
త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పర్సా అని కొనియాడారు.
పర్సా పోరాటాలకు వారసులుగా పని చేస్తాం : పాలడుగు భాస్కర్‌
పర్సా పోరాటాలకు, త్యాగాలకు, ఆదర్శాలకు వారసులుగా తాము పని చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. కార్మిక, కర్షక ఐక్యతను బలోపేతం చేసి మతోన్మాద, కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని అన్నారు. 54 సంవత్సరాల సీఐటీయూ ఉద్యమ ప్రస్థానంలో పర్సా వేసిన పునాదుల పైనే సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామన్నారు.
సరళీకరణ విధానాలపై పోరాటమే పర్సాకి ఇచ్చే నివాళి : సిహెచ్‌. నర్సింగరావు
నిర్బంధాలు అణిచివేత ఉన్న కాలంలో పర్సా కార్మిక ఉద్యమాన్ని నిర్మించారని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌. నర్సింగరావు తెలిపారు. నేడు సరళీకరణ విధానాలు కార్మిక ఉద్యమాలను బలహీన పరుస్తూ.. ప్రజలపై భారాలు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సరళీకరణ విధానాలను ప్రతిఘటించడమే పర్సాకు ఇచ్చే అసలైన నివాళి అని తెలిపారు.
కార్మిక కర్షక ఐక్యతకు పర్సా పునాదులు వేశారు – బి.వెంకట్‌
కార్మిక, కర్షక, ఐక్యతకు పర్సా పునాదులు వేశారని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. ఉత్పత్తి వర్గాలైన కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు కలిసి పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీలు రూ.400 నుంచి నేడు రూ.10వేల వరకు వేతనాలు పొందుతున్నారంటే పోరాటాల ఫలితమే అన్నారు. ఇప్పుడు దేశానికి కావల్సింది.. గుజరాత్‌ మోడల్‌ కాదని, వామపక్ష కేరళ మోడల్‌ కావాలని అన్నారు. అనంతరం ‘మతోన్మాదం కార్మిక వర్గం ప్రభావం’ అంశంపై జరిగిన పర్సా స్మారక ఉపన్యాసంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు కాసాని ఐలయ్య, భద్రాద్రి జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చావ రవి, సీిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, మందా నరసింహారావు పాల్గొన్నారు.

Spread the love