నవతెలంగాణ-సిర్పూర్ (టి)
మండలంలోని పలు గ్రామాల్లో ఏండ్లుగా అసైన్మెంట్ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద, సన్నకారు రైతుల్లో 22-ఏ నిషేధిత భూముల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. తమ బతుకుదెరువుకు ఆధారమైన భూములు 22-ఏ నిషేధిత జాబితాలో ఉండటంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందడంలో, వ్యవసాయానికి అవసరమైన ఎరువులు తదితర సౌకర్యాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూముల వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హులైన సాగుదారులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
22-ఏను రైతుల భూములు తీసుకునే చట్టంగా చూడొద్దు
22-ఏను కేవలం రైతుల భూములను తీసుకునే చట్టంగా చూడటం సరికాదనీ, ప్రధానంగా కొన్ని ప్రభుత్వ, అసైన్మెంట్, దేవాదాయ, వక్ఫ్, ఇతర రక్షిత భూములతో పాటు చట్టపరంగా నిషేధితమైన ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారని చెప్పారు. అయితే రికార్డుల్లో తప్పులు, పాత రెవెన్యూ రికార్డులు–ప్రస్తుత పరిస్థితుల మధ్య వ్యత్యాసాల కారణంగా అర్హులైన సాగుదారుల భూములు కూడా నిషేధిత జాబితాలో చేరిన సందర్భాల్లో బాధితులకు పరిష్కారం లభించే అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
పాత రికార్డులతో భూముల స్వభావం తేల్చాలి
భూముల వాస్తవ స్వభావాన్ని నిర్ధారించేందుకు పాత రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా 1936 సెత్వార్, 1954–55 కాస్త్ర పహాణి, 1954–55 నాటి ఇతర రెవెన్యూ రికార్డులు, 1975 సీలింగ్ రికార్డులు, అసైన్మెంట్ రికార్డులు, ప్రస్తుత భూ రికార్డులను పరిశీలించి భూములపై స్పష్టత తీసుకురావాలని కోరుతున్నారు. పాత కాస్త్ర పహాణీల్లో భూమి ఎవరిపేరుతో, ఏ స్వభావంతో నమోదై ఉందో పరిశీలించడంతో పాటు తదనంతరం జరిగిన అసైన్మెంట్, సాగు, భూ రికార్డుల మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పాత రికార్డులు, ప్రస్తుత రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉంటే వాటిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామాల వారీగా సమగ్ర సర్వే చేయాలి
సిర్పూర్ మండలంలోని 22-ఏ భూములపై గ్రామాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో 22-ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల విస్తీర్ణం గ్రామాల వారీగా పరిశీలిస్తే అచ్చెలి 668 ఎకరాలు, ఆరెపల్లి 146, భూపాలపట్నం 759, చిల్లపల్లి 543, చింతకుంట 238, చుంచుపల్లి 583, డోర్పల్లి 304, గార్లపెట్ 247, హిరపూర్ 219, హుడికిలి 215, జక్కాపూర్ 159, లక్ష్మీపూర్ 684, లోనవెల్లి 562, మాకిడి 208, మేడిపల్లి 338, నవేగాం 236, పారిగాం 168, రాజారాం 391, రుద్రారం 1,977, సిర్పూర్ 990, టోకిని 272, వేంపల్లి 495 ఎకరాలుగా ఉన్నాయి. వెంకట్రావుపేట్‌లో 2.26 ఎకరాల భూమి 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. బొంకిలో భూములు లేవని వివరాలు సూచిస్తున్నాయి.
ఇంత పెద్ద మొత్తంలో భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో గ్రామాల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, పాత రికార్డులు–ప్రస్తుత రికార్డులను సరిపోల్చి అర్హులైన రైతుల భూముల విషయంలో స్పష్టత తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ గందరగోళం వద్దు.. రైతులకు భరోసా కల్పించాలి
22-ఏ భూముల అంశంపై రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కంటే రైతుల సమస్యకు పరిష్కారం చూపడంపై దృష్టి పెట్టాలని రైతులు అంటున్నారు. పేద రైతుల్లో భయాందోళనలు కలిగించే విధంగా కాకుండా వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని కోరుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సమగ్రంగా చర్చించి, నిషేధిత జాబితాలో తప్పుగా చేరిన భూములను గుర్తించి సరిచేసేందుకు స్పష్టమైన విధానం రూపొందించాలని, ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు అసైన్మెంట్ భూములను ఏండ్లుగా సాగు చేసుకుంటున్న అర్హులైన పేద రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించి, అసైన్మెంట్ భూములు సాగు చేస్తున్న పేద రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
22-ఏ నుంచి పేద రైతులను తొలగించాలి: దుర్గం దినకర్, సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు
జిల్లాలో భూములను 22-ఏ జాబితాలో చేర్చడాన్ని సీపీఐ(ఎం) పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ, ముఖ్యంగా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములను 22-ఏలో చేర్చడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 22-ఏలో ఉన్న భూములకు బ్యాంకు రుణాలు కూడా అందని పరిస్థితి నెలకొందన్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల భూములను 22-ఏ నుంచి తొలగించి, వారికి రుణ సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) పార్టీ తరఫున డిమాండ్ చేశారు.



