మేడేను వద్దన్న మోడీని వదిలించుకుందాం

మేడేను వద్దన్న మోడీని వదిలించుకుందాం– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– ఖమ్మం పట్టణంలో మేడే ఉత్సవాలు
నవతెలంగాణ-ఖమ్మం
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే విదేశీయులకు చెందిందని, మే డేని రద్దు చేస్తానని పిలుపునిచ్చిన ప్రధాని మోడీని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించి కార్మిక ఐక్యతను చాటుకుందామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం నగరంలోని గ్రేయిన్‌ మార్కెట్‌ ఎదురుగా ఉన్న సీఐటీయూ కార్యాలయం వద్ద మే డే 138వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం కార్మిక వర్గం ప్రాణతర్పణం చేసి సాధించుకున్నారని గుర్తు చేశారు. నేడు కార్మిక వర్గం అనుభవిస్తున్న ఏ హక్కు కూడా ఒకరి దయాదాక్షిణ్యాల మీద వచ్చినవి కాదని, పోరాడి సాధించుకున్న హక్కులని గుర్తు చేశారు. కానీ నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆ కార్మిక చట్టాలన్నీ రద్దుచేసి కొత్తగా నాలుగు లేబర్‌ కోడ్లను ముందుకు తెస్తుందన్నారు. ఈ లేబర్‌ కోడ్‌లలో.. 12 గంటల పనివిధానం, సెలవు దినాలు లేకుండా, కార్మిక సంక్షేమ చట్టాల మార్పు, యజమాని, కార్మికుల మధ్య సంబంధాలను పక్కన పెట్టేలా, పూర్తిగా కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం రూపొందించారని విమర్శించారు. పైగా ఇప్పటివరకు ఉన్న హక్కులన్నీ విదేశీ చట్టాలని, మేడే పండుగ కూడా విదేశాల నుండి దిగుమతి అయిందని తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోడీని ఓడించడం ద్వారా మేడే స్ఫూర్తిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భూక్య శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు, జిల్లా ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరావు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎర్రా శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, అధ్యక్షులు టి. విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Spread the love