మన బడిని కాపాడుకుందాం

Let's save our moneyరాంపూర్‌ పాఠశాలకు బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయునికి వింత అనుభవం ఎదురయింది. పచ్చని చెట్ల మధ్య ఉన్న పాఠశాల వాతావరణం ఆకట్టుకుంది కానీ తరగతి గదులు సరిపడా లేవు. అంతేకాకుండా విద్యార్థులకు బెంచీలు, బల్లలు అసలే లేవు. తీరా చూస్తే విద్యార్థుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. మరోవైపు గ్రామంలోని చాలామంది విద్యార్థులు దగ్గర్లో ఉన్న మండల కేంద్రానికి బస్సులో ప్రైవేటు పాఠశాలకు వెళుతున్నారు. ఇది ఎంత మాత్రం నచ్చలేదు ప్రధానోపాధ్యాయునికి. ఆరోజు రాత్రంతా తీవ్రంగా ఆలోచించారు. ఏ విధంగానైనా సరే రాంపూర్‌ బడిని కాపాడుకోవాలని, మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని పరిపరి విధాల ఆలోచించారు. చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు.
మరుసటి రోజు గ్రామంలో కచేరి దగ్గర ఒక గ్రామ సభను ఏర్పాటు చేసి, గ్రామంలోని ప్రతి ఒక్కరూ సమావేశానికి తప్పనిసరిగా హాజరు అవ్వాలని సందేశం పంపారు. గ్రామస్తులు చాలా ఆసక్తిగా, కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయులు ఎందుకు రమ్మని చెప్పరన్నది ఎవరికీ అర్థం కాలేదు. తమ వ్యక్తిగత పనులను సైతం వదలుకొని ఆనాటి సమావేశానికి అందరూ హాజరయ్యారు.
సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామ ప్రజలారా, ఈ ఊర్లోని పాఠశాలలో చక్కటి విద్యార్హతలు, బోధన అనుభవం ఉన్న ఉత్సాహవంతులైన ఉపాధ్యాయులు ఉన్నా కూడా మీరు ప్రైవేటు పాఠశాలలకు పంపడం బాధాకరం. దీనికి కారణం అడిగితే పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని సమాధానం చెబుతున్నారు. మీ అందరి సహకారంతో మన బడికి అవసరమైన వసతులు ఏర్పాటు చేసుకొని, మీ పిల్లలను ఇక్కడనే చదివించేలా చేద్దాం. మన ఊరు బడిని మనమే కాపాడుకుందాం. దీనికి మీరందరూ ఏమంటారు? మీ అభిప్రాయం చెప్పం”డని అడిగారు ప్రధానోపాధ్యాయులు.
కొద్దిసేపు గ్రామస్తులందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. తమలో తాము అందరూ సమైక్యంగా చర్చించుకున్నారు. తర్వాత అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. తలా కొంత చందాల రూపంలో పోగుచేసుకుని ”మన ఊరు మన బడి” అని ఒక నిధిని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తాను చేసే సహాయం ఈ నిధికి అందించాలన్నారు. మన ఊరు బడిని మనమే కాపాడుకుందాం అని అందరూ అన్నారు. అందరిది ఇదే నిర్ణయమని ప్రధానోపాధ్యాయులు గారికి తెలియజేశారు. గ్రామస్తుల నిర్ణయానికి సంతోషించారు ప్రధానోపాధ్యాయులు. అతి తక్కువ సమయంలో మన ఊరు మనబడి సహాయ నిధికి దాదాపుగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అందించారు. ఆ మొత్తం అయిదు లక్షల రూపాయలయ్యాయి. విద్యార్థులకు తరగతి గదులను, మధ్యాహ్న భోజనానికి వంటగదిని, కంప్యూటర్‌ గదిని గ్రంథాలయాన్ని చక్కగా నిర్మించారు. ఇప్పుడు రాంపూర్‌లో బడి చాలా అందంగా ఆకర్షణీయంగ తీర్చిదిద్దబడింది. ఒక్కరు కూడా గ్రామం నుండి ప్రైవేట్‌ స్కూల్‌కి పోవడం లేదు.
ఒకప్పుడు నామ మాత్రమే విద్యార్థులతో ఉన్న పాఠశాల నేడు విద్యార్థులతో నిండిపోయి కిటకిటలాడుతుంది. గ్రామస్థుల సహకారంతో పాఠశాలను మండలంలోనే అగ్రగామిగా నిలిపారు. ఉపాధ్యాయుల కృషి, గ్రామస్తుల సహకారంతోనే రాంపూర్‌ పాఠశాల పూర్వ వైభవాన్ని పొందిందని ప్రధానోపాధ్యాయులు గర్వంగా చెపుతున్నారు
నీతి: ఊరి బడిని కాపాడుకుందాం సమిష్టిగా చేయూతనిద్దాం.

– యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌, 9441762105

Spread the love