ఆహారం విలువ

ఆహారం విలువసుదర్శనుడు పట్టణంలో విద్య పూర్తి చేశాడు. గురువుగా శిష్యులకు విద్యాబోధన చేయాలని అతనికి కోరిక. అందుకు తగిన శిక్షణ కూడా కొంతమంది గురువులవద్ద పొందాడు. ఆ ప్రాంతం జమీందారు చేత నడపబడుతున్న పాఠశాలలో గురువుగా చేరాడు. కేవలం శిష్యులకు బోధన చేయడమే గాక సుదర్శనుడు పాఠశాలలో ప్రతివిషయాన్ని ప్రత్యేకశ్రద్ధతో గమనించేవాడు. సమస్యల్ని సత్వరం పరిష్కరించేవాడు. మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లల్ని సుదర్శనుడు వారిని గమనిస్తుండేవాడు. అలా పరిశీలిస్తున్నపుడు ఆయనకు ఒక విషయం బాధ కలిగిస్తూవుండేది. పిల్లలు పళ్ళెంలోని ఆహారాన్ని సరిగా తినరు. పళ్ళెంచుట్టూ ఆహారాన్ని పడవేస్తారు. అది ఇక దేనికీ పనికిరాదు. పనివాళ్ళు దాన్ని చిమ్మి బయట పడవేస్తారు. సుదర్శనుడు దీని విషయమై ఆలోచించాడు. ఎలా అయినా ఆహారవృధాను అరికట్టాలనుకున్నాడు. పిల్లలకు ఆహారం విలువను చిన్ననాటి నుండే తెలియజెప్పాలనుకున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయం రాగానే, పిల్లలతో పాటు తానుకూడ భోజనశాలలో భోంచేయడానికి పళ్ళెం ముందు పెట్టుకుని కూర్చున్నాడు. గురువు గారు తమతోపాటే కూర్చుని బోంచేయాలనుకోవడం శిష్యులకు ఆశ్చర్యం కలిగించింది. వారికి మరీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమంటే గురువుగారు తన పళ్ళెంముందు ఒక మంచినీళ్ళపాత్ర, ఒక సూది వుంచుకున్నాడు. తినేటప్పుడు మెతుకు కిందపడగానే గురువుగారు ఆ మెతుకును సూదితో గుచ్చి పాత్రలోని మంచినీళ్ళల్లో ముంచి శుభ్రంచేసి మళ్ళీ పళ్శెంలో వేసుకుని భోంచెయ్యసాగాడు. విద్యార్థుల్లో కారణం తెలుసుకోవాలన్న ఆతృత. కానీ గురువుగారిని అడగడానికి భయం. చివరకు వారం తరువాత భయపడుతూనే అడిగారు. దానికి ఆయన, ”అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. అంటే అన్నం దైవంతో సమానం. ఒక్కగింజ పండించడానికి రైతు పడే శ్రమ అంతా ఇంతా అని చెప్పలేం. అంతేగాక ఒక్కపూటయినా కడుపునిండా తినలేనివారు ఈ లోకంలో ఎంతోమంది వున్నారు. అది మనం మరువకూడదు. మీరు ఇవేమీ గుర్తించడంలేదు. సగం తిని సగం పారవేస్తున్నారు. ఆ విధంగా ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎప్పుడో తిరువళ్ళువర్‌ తన తిరుక్కురల్‌ (నీతిపాటలు) అనే గ్రంథంలో చెప్పారు. చెప్పడమేగాక ఆయన ఆచరించి చూపారు. తాను భోంచేసేటప్పుడు పళ్ళెంముందు మంచినీళ్ళున్న చిన్న పాత్ర, సూది వుంచుకునేవారు. మెతుకు కిందపడగానే ఆయన సూదితో దాన్ని తీసి మంచి నీళ్ళపాత్రలో ముంచి శుభ్రంచేసి పళ్ళెంలో వుంచుకుని తినేవారు. ఆయన ఉద్దేశం ఏమంటే ఒక్కమెతుకు కూడా వృథా కాకూడదని. ప్రతి మెతుకూ విలవైనదని. రోజూ మిమ్మల్ని నేను గమనిస్తూనే వున్నాను. మీరు ఆహారవిషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనిపించింది. ఆహారం విలువ మీకు తెలియజేయాలనిపించింది. అది మాటలతో చెప్పేకంటే చేతలతో చూపిస్తే బావుంటుందని మీతో కలిసి భోంచేస్తూ తిరువళ్ళువర్‌ చేసినట్లే చేసి చూపించాను. మాటలకంటే చేతలు ఎక్కువ ప్రభావం చూపుతాయిగదా!” అంటూ వారికి హితబోధ చేశాడు.
గురువుగారి మాటలు శిష్యుల కళ్ళు తెరిపించాయి. వారికి ఆహారం విలువ తెలిసొచ్చింది. పిల్లలు గురువుగారికి క్షమాపణలు చెప్పారు. ఆ తరవాత వారు అన్నాన్ని దైవంగా భావిస్తూ ఆహార వృథాను అరికట్టారు. శిష్యుల్లో వచ్చిన మార్పు చూసి సుదర్శనుడు ఆనందించాడు.
డా||గంగిశెట్టి శివకుమార్‌

Spread the love